అమెరికాలో ఒక్క‌రోజే ప‌ది ల‌క్ష‌ల కేసులు…ఫ్రాన్స్ లో కొత్త వేరియంట్

అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్లోలం సృష్టిస్తుంది. ఒక్క‌రోజే ప‌ది ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఒకే రోజు ఇన్ని కేసులు ఏ దేశంలో న‌మోదు కాలేదు.  అమెరికాలో గ‌త నాలుగు రోజుల నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 5,90,000కేసులు న‌మోదు అయ్యాయి. కాగా సోమ‌వారం నాటికి ఆ సంఖ్య కాస్తా రెట్టింపు అయింది.
క‌రోనా క‌ట్ట‌డి కోసం బైడెన్ స‌ర్కార్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. కరోనా ఉధృతి నేప‌థ్యంలో అమెరికాలో స్కూళ్లు, కార్యాల‌యాల‌ను మూసివేశారు. విమానాల‌ను ర‌ద్దు చేశారు. ఇక క‌రోనా, ఒమిక్రాన్ కేసుల తీవ్ర‌త‌తో హాస్ప‌టల్స్ నిండిపోతున్నాయి. దాదాపు అక్క‌డి ఆస్ప‌త్రుల్లో 70 శాతం వ‌ర‌కు నిండిపోయిన‌ట్టు స‌మాచారం.
క‌రోనా బారిన‌ప‌డుతున్న వారిలో ఆరోగ్య సిబ్బంది సైతం అధికంగా ఉండ‌టంపై ఆ దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ తీవ్ర ఒత్తిడికి గుర‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని నిపుణులు తెలిపారు. కరోనావైరస్ వ్యాధి కారణంగా ఆస్ప‌త్రిలో చేరిన వారి సంఖ్య అమెరికాలో దాదాపు నాలుగు నెలల్లో రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 100,000 మందికి పైగా చేరారు.
యు.ఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ నుండి వచ్చిన తాజా డేటా ప్ర‌కారం. కరోనా  కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరిన వారి సంఖ్య చివరిగా 2021 సెప్టెంబర్ 11న 100,000ను దాటింది. ప్రతి ఏడుగురిలో ఒకరు కరోనాతో బాధపడుతున్నారని రిపోర్ట్స్ తెలిపాయి.
అమెరికాలోని ఒహియో, డెలావేర్, న్యూజెర్సీ, వ్యోమింగ్, అలాస్కా వంటి ప్రాంతాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. క‌రోనా బారిన‌ప‌డి ఆస్ప‌త్రుల్లో చేరుతున్న పిల్ల‌ల సంఖ్య పెరుగుతుండ‌టం మ‌రింత ఆందోళ‌న‌కి గురి చేస్తుంది. డిసెంబర్ 31తో ముగిసిన వారంలో ప్రతిరోజూ 500 మందికి పైగా పిల్లలు క‌రోనాతో ఆస్ప‌త్రుల్లో చేరుతున్నార‌ని అమెరికా  సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ) డేటా వెల్ల‌డించింది.
మరోవంక, ఐహెచ్‌యుగా పేర్కొంటున్న ఈ బి.1.640.2 వేరియంట్‌ను దక్షిణ ఫ్రాన్స్‌లో బయటపడడంతో దేశం మొత్తం అప్రమత్తమైంది. ఇప్పటివరకు 12మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. కామెరూన్‌ దేశానికి వెళ్లిన వారిలో ఇది సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ వేరియంట్‌ ఎలా వ్యవహరిస్తుందో ఇప్పుడే అంచనాకు రావడం కష్టమని వారు పేర్కొంటున్నారు.
 
 ఐహెచ్‌యులో 46 మ్యుటేషన్లు, 37 డిలీషన్లు (జన్యు పదార్థం లోపించిన మ్యుటేషన్‌ను డిలీషన్‌ మ్యుటేషన్‌ అంటారు) వున్నాయని అధ్యయనం వెల్లడించింది. స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రస్తుతం ఉపయోగిస్తున్న వ్యాక్సిన్లు వున్నాయి. వైరస్‌ ఈ ప్రొటీన్‌ను ఉపయోగించుకునే కణాల్లోకి ప్రవేశించి, ఇన్ఫెక్షన్‌ను కలగచేస్తుంది. 
 
ఈ వేరియంట్‌లోని ఎన్‌501వై, ఇ484కె మ్యుటేషన్లను గతంలో బీటా, గామా, తీటా, ఒమిక్రాన్‌ వేరియంట్లలోనూ గుర్తించారు. మ్యుటేషన్లు జరుగుతున్న తీరు, వాటి జన్యు స్థితి, వీటన్నింటి ఆధారంగా కొత్త వేరియంట్‌కు ఐహెచ్‌యు అని పేరు పెట్టినట్లు అధ్యయన రచయితలు పేర్కొన్నారు. 
 
ఇతర దేశాల్లో ఈ వేరియంట్‌ను ఇంతవరకు గుర్తించలేదు. ఈ కొత్త వేరియంట్‌ ఏ కేటగిరీలో పడుతుందో చూడాల్సి వుందని అంటువ్యాధుల నిపుణుడు ఫెగిల్‌ డింగ్‌ వ్యాఖ్యానించారు.