50 శాతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్‌ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
 
గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయాలకు రావడంపై మినహాయింపు ఇచ్చింది. అదే సమయంలో సిబ్బంది ఆఫీస్ కు వచ్చేందుకు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు రెండు సమయాలను నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు వచ్చిన వారు సాయంత్రం 5.30 గంటలకు, పొద్దున పదింటికి వచ్చిన వారు సాయంత్రం 6.30 గంటలకు వెళ్లాలని ఆదేశించింది.
 
రాకపోకల సమయంలో రద్దీని నివారించేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు కేంద్రం పేర్కొంది. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో ఉండేవారు కూడా ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అండర్‌ సెక్రటరీ, అంతకంటే ఎక్కువ ర్యాంకుల్లో ఉన్న అధికారులు కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని పేర్కొంది.
 
కార్యాలయాల్లో జరిగే సమావేశాలను వీలైనంత మేరకు వీడియో సమావేశం విధానంలో నిర్వహించాలని సూచించింది. ఆఫీసులకు వచ్చే సందర్శకులతో భేటీ అవడం అత్యవసరం, తప్పనిసరి అయితే తప్ప విరమించుకోవాలని తెలిపింది. మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం సహా కార్యాలయాల్లో కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలయ్యేలా అధికారులు అంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
 
కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా 
 

తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే, బీజేపీ లోక్‌సభ ఎంపీ మనోజ్ తివారీలకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఎంపీ మనోజ్ తివారీ కూడా తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి తాను అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. తనకు జ్వరం రావడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నానని.. ఆ ఫలితాలు మంగళవారం వచ్చాయని ఆయన తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 578, ఢిల్లీలో 382 ఒమిక్రాన్ బాధితులు ఉన్నారు. 

కేరళలో 185, రాజస్థాన్ 174, గుజరాత్ లో 152 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 1,892 ఒమిక్రాన్ కేసులు నమోదు అయితే.. అందులో 799 మంది కోలుకున్నట్లు తెలిపారు  అధికారులు. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.

మరో వైపు కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 37 వేల 379 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో  11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 124 మంది కరోనాతో మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,71,830కి చేరింది. కరోనా రోజువారీ పాజిటివీటి రేటు 3.24 శాతంగా నమోదైంది.