తొలిరోజు 37 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్ల లోపు అర్హులైన టీనేజర్లకు కోవిడ్ తొలి డోసు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. తొలి రోజైన సోమవారంనాడు 37 లక్షల మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. కోవిన్ పోర్టల్ వివరాల ప్రకారం, రాత్రి 7 గంటల వరకూ 37,84,212 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 
 
దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా అర్హులైన టీనేజర్లు సుమారు 10 కోట్ల మంది వరకూ ఉన్నారు.

అర్వింద్ కేజ్రీవాల్‌కు కరోనా 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం ఉదయం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో తాను ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నానని సీఎం కేజ్రీవాల్ చెప్పారు.‘‘నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది.కరోనా తేలికపాటి లక్షణాలుండటంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు మీరు ఐసోలేషన్‌లో ఉండండి. మీరు కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 
 
ఢిల్లీలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 6.46 శాతంగా ఉంది. ఢిల్లీలో 6,288 మందికి కరోనా సోకింది.సోమవారం కొవిడ్ వల్ల ఢిల్లీలో ఒకరు మరణించారు.
 
ఇలా ఉండగా,  కోల్‌కతా, పాట్నాలో సుమారు 200 మంది వైద్యులు కరోనా బారినపడ్డారు. కోల్‌కతాలో 24 గంటల వ్యవధిలోనే వందమంది వైద్యులు ఈ మహమ్మారి భారినపడ్డారు. అత్యధికంగా కోల్‌కతా నేషనల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పటల్‌లో సుమారు 70 మంది వైద్యులు, కాళీఘాట్‌లో ఉన్న చిత్తరంజన్‌ సేవా సదన్‌, శిశు సదన్‌ ఆసుపత్రిలో 24 మంది వైద్యులు, రీజనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆప్థమాలజీలో 12 మంది వైద్యులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వీరందరీన్ని వ్యవస్థాగత కార్వంటైన్‌లో ఉండాలని సూచించినట్లు చెప్పారు.
బీహార్‌ రాజధాని పాట్నాలో రెండురోజుల్లో వందకు పైగా వైద్యులు కరోనా భారినపడ్డారు. నలంద మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పటల్‌ (ఎన్‌ఎంసిహెచ్‌)లోనే 96 మంది వైద్యులు కరోనాకు గురయ్యారు. వీరిలో అధిక శాతం మంది కోవిడ్‌ వార్డుల్లో విధులు నిర్వహిస్తున్నారు.
కాగా, కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 16వ తేది వరకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు.