తెలంగాణలో నియంతృత్వ పాలన.. మండిపడ్డ నడ్డా

రెండు రోజులుగా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయని అంటూ తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. 
 
సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నడ్డా,  అనంతరం ర్యాలీ లేకుండానే నిరసనలతో కార్యక్రమాన్ని ముగించి బిజెపి కార్యాలయంకు చేరుకున్నారు.  జెపి నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌, బిజెపి సీనియర్‌ నేత లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, నేతలు వివేక్‌, డికె అరుణ, విజయశాంతి తదితరులు సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. 
 ‘‘మాది క్రమశిక్షణ గల పార్టీ. కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన తెలిపాం. నన్ను ఎయిర్‌పోర్ట్‌ దగ్గరే అడ్డుకున్నారు. కరోనా నిబంధనలు ఉన్నాయంటూ పోలీసులు చెప్పారు. నిబంధనలు పాటిస్తూనే గాంధీజీకి నివాళులర్పిస్తానని పోలీసులకు చెప్పాను” అని తెలిపారు.
 
తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకే వచ్చాననిచెబుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఓటమితో కేసీఆర్‌ మానసిక స్థితి దెబ్బతిందని విమర్శించారు. ‘‘కేసీఆర్‌తో పోరాడేది కేవలం బీజేపీయే. 317 జీవో సవరించే వరకు బీజేపీ పోరాడుతుంది. తెలంగాణ ప్రజల తరఫున బీజేపీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాను.  తెలంగాణ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం” అని తెలిపారు. 
 
బండి సంజయ్ జీవో 317 ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల వ్యతిరేక ఉత్తర్వులను సవరించాలని పోరాడారని పేర్కొంటూ తెలంగాణ మంత్రులు ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నా శాంతియుతంగా జాగరణ దీక్ష చేపడితే పోలీసులు బండి సంజయ్ పై మ్యాన్ హ్యాండిల్ చేశారని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
బండి సంజయ్ కార్యాలయంలోకి తెలంగాణ పోలీసులు ప్రవేశించి బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడి, లాఠీఛార్జి చేయడం తీవ్ర ఆక్షేపణీయం, ఖండనీయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులే బీజేపీ నేతలు, కార్యకర్తలపై హింసకు పాల్పడ్డారని ఆరోపించారు.
 
శాంతియుతంగా చేస్తున్న బండి సంజయ్ దీక్షను చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడిందని, వారందరిపై దాడి చేసి చెదరగొట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించిందని ఆరోపించారు. తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపు, అరాచకత్వానికి నిదర్శనంగా భారీ పోలీసు బలగాలతో పక్కా వ్యూహంతో దాడికి పాల్పడ్డారని నడ్డా ధ్వజమెత్తారు.
 
పోలీసులు ముందుగా ఇనుప గేట్లను కట్ చేసి బలవంతంగా దీక్ష చేస్తున్న ప్రాంతానికి చేరుకున్నారని నడ్డా చెప్పారు. ఆ వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆయన వెంట ఉన్న నేతలు, కార్యకర్తలపై అమానుషంగా దాడికి పాల్పడి అరెస్ట్ చేశారని వెల్లడించారు.
 
కేసీఆర్ తీరుపై సిగ్గుపడుతున్నట్లు చెబుతూ కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటిఎంలా మారిందని ఆరోపించారు.  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఒక్క చుక్క నీరు రాలేదని అంటూ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు గా ఉంది కేసీఆర్ తీరని దుయ్యబట్టారు. బండి సంజయ్ అరెస్ట్‌ను జాతీయ పార్టీ ఖండిస్తుందని చెబుతూ  ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేస్తామని నడ్డా స్పష్టం చేశారు. 
 
కరోనా విషయంలో గందరగోళం సృష్టించిన కేసీఆర్ మాటలను వీడియో రూపంలో చూపించారు. మరోవంక, తన హక్కులకు భంగం కలిగిందంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాసిన ఫిర్యాదు లేఖపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. 48 గంటల్లో నిజ నిర్ధారణ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖను ఆదేశించారు. దీనికి సంబంధించి తెలంగాణ అధికారులకు ఇప్పటికే నోటీసులు అందినట్లు సమాచారం. ప్రివిలేజ్ మోషన్ కింద స్పీకర్‌కు సంజయ్ లేఖ రాశారు.