ఐదు రోజుల్లో 8 మంది ఉగ్రవాదులు హతం

కశ్మీర్ లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు పంజా విసుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను మట్టబెడుతున్నాయి. తాజాగా పుల్వామాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు మృతి చెందారు. 
 
ఈ విషయాన్ని కశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు. వారిలో ఒకరిని పాకిస్థాన్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వారి నుంచి రెండు ఎం4 కార్బైన్లతోపాటు ఒక ఏకే సిరీస్ రైఫిల్ సహా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.  ఇది పెద్ద విజయమని పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో గడిచిన ఐదు రోజుల్లో 8 మంది టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టడం గమనార్హం. 
 
కాగా, మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని విజయ్ కుమార్ తెలిపారు. హత్యకు గురైన ఇద్దరు కూడా స్థానికులని ఎల్‌ఇటికి అనుబంధంగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.  
 
గల్వాన్ లోయలో భారీ త్రివర్ణ పతాకం
 
 నూతన సంవత్సరాది వేడుకల్లో భాగంగా తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత జవాన్లు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబూని వేడుకలు జరుపుకొన్న ఫోటోలను భారత సైన్యం మీడియాకు విడుదల చేసింది. 
 
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు కూడా తన ట్విట్టర్‌లో ఈ ఫొటోలను షేర్ చేశారు. ‘న్యూఇయర్ 2022 సందర్భంగా గల్వాన్ లోయలో సాహసవంతులైన భారతీయ జవాన్లు’ అన్న శీర్షికతో మంత్రి ఈ ఫోటోలను షేర్ చేశారు. 
 
మూడు రోజుల క్రితం చైనా అధికారిక పత్రిక ‘ గ్లోబల్ టైమ్స్’ గల్వాన్ లోయలో చైనా సైనికులు నూతన సంవత్సరం సందర్భంగా చైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసి, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారంటూ దానికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 
 
ఇదంతా జరిగిన మూడు రోజలు తర్వాత ఆర్మీ ఇప్పుడు ఈ ఫోటోలను విడుదల చేసింది. దాదాపు 30 మంది భారతీయ జవాన్లు త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ఉన్నట్లుగా ఒక ఫోటోలో ఉంది.