కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే చాలారాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ దిశగానే ఢిల్లీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం రాత్రి పదిగంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. అయితే ప్రజా రవాణాపై ఆంక్షల్లో కూడా మార్పులు చేశారు. బస్సులు, మెట్రోలు పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సామర్థ్యంతో ఉద్యోగులు హాజరు కావాలని తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశించారు.
ఢిల్లీలో పాజిటివిటీ రేటు వరుసగా రెండు రోజుల పాటు ఐదు శాతం కంటే ఎక్కువగా నమోదు కావడంతో యాక్షన్ ప్లాన్ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో పాటిటివిటీ రేటు 6.46 శాతంగా ఉంది. ప్రతి 100 టెస్టుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం నివేదించింది.
సోమవారం 24 గంటల్లో 4,099 కొత్త కేసులు, ఒక మరణం నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. జనవరి నెల సగం నాటికి ఢిల్లీలో రోజుకు 20 నుంచి 25 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఢిల్లీలో ఇప్పటికే రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. సినిమా హాళ్లు, జిమ్‌లు మూసివేయబడ్డాయి. అదేవిధంగా దుకాణాలు బేసి-సరి ప్రాతిపదికన అనుమతిస్తున్నారు.
మహారాష్ట్రలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ శాఖల మంత్రి ఏక్‌నాథ్ షిండేకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మహారాష్ట్రలో ఇప్పటికే 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు రెండ్రోజుల క్రితం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు.
ఆ రాష్ట్రంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. సోమవారం ఒక్క రోజే ఆ రాష్ట్రంలో 11,877 కొత్త కరోనా కేసులు వచ్చాయి. అంతకు ముందు రోజు 8,063 కేసులు రాగా.. సోమవారం 27 శాతం కేసులు పెరిగాయి. ఇక మహారాష్ట్రలో దేశంలోనే అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 578 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి.
పంజాబ్ లో రాత్రి కర్ఫ్యూ
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో పంజాబ్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేసింది. అయితే ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సమావేశాలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చెన్ని నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం కొత్త ఆంక్షలను ప్రకటించింది. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలను మూసివేయాలని, అన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని ఆదేశించింది.
మెడికల్, నర్సింగ్ కళాశాలలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. బార్లు, సినిమాహాళ్లు, మల్టిప్లెక్సెస్, మాల్స్, రెస్టారెంట్స్, మ్యూజియంలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందితో 50 శాతం ఆక్యుపెన్సీతో పనిచేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలు జనవరి 15 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే అనుమతించాలని ఈ ఆంక్షల్లో పేర్కొంది. స్టేడియం, స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసివేయాలని, కేవలం జాతీయ, అంతర్జాతీయ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు మాత్రం శిక్షణ తీసుకోవచ్చని తెలిపింది. కాగా, పశ్చిమ బెంగాల్ లో మాజీ కేంద్రమంత్రి, టిఎంసినేత బాబుల్ సుప్రియో మూడోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.
More Stories
90కి పైగా ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు
ఉత్తరాఖండ్ పాఠశాలల్లో భగవద్గీత శ్లోకాలు
భారీ వర్షాలతో అమర్నాథ్ యాత్రకు బ్రేక్