సంజయ్ అరెస్ట్ కు నిరసనగా నిరసనలు… నేడే నడ్డా రాక 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​కి కరీంనగర్ కోర్టు బెయిల్ నిరాకరించి, 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఈ 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరపాలని రాష్ట్ర బిజెపి నిర్ణయించింది. సంజయ్ అరెస్ట్‌‌ను నిరసిస్తూ మంగళవారం సాయంత్రం బీజేపీ హైదరాబాద్ లో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. 
 
ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న బాబు జగ్జీవన్‌‌రాం విగ్రహం నుంచి లిబర్టీలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం దాకా ఈ ర్యాలీ జరుపుతున్నట్లు ప్రకటించారు. మరోవంక, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నేడు కరీంనగర్ వెళ్లి జైలులో ఉన్న సంజయ్ ను పరామర్శించి, ఆయనను అరెస్ట్ చేసిన ఎంపీ కార్యాలయంకు కూడా వెడతారు. 
 
అరెస్ట్ ను ఖండిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు జరిపి, కేసీఆర్ దిష్టి బొమ్మలను బిజెపి కార్యకర్తలు  దగ్ధం చేశారు. సంజయ్ అరెస్టును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో హైదరాబాద్‌లో పార్టీ సీనియర్ నేతలు బయటకు రాకుండా తెల్లవారుజాము నుంచే పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు.
మరోవైపు తనను అక్రమంగా అరెస్టు చేసి, ఎంపీగా తన హక్కులకు భంగం కలిగించారంటూ పోలీసు కస్టడీ నుంచే లోక్ సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర గవర్నర్ తదితరులకు బండి సంజయ్ ఫిర్యాదులు చేశారు. సంజయ్ రిమాండ్‌లో ఉండే 14 రోజులు నిరసనలు చేబడుతున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి తెలిపారు.
కరోనా నిబంధనలను​ ఉల్లంఘించారని, తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ బండి సంజయ్​పై కరీంనగర్​ టూ టౌన్  పోలీస్​స్టేషన్​లో  పోలీసులు కేసులు పెట్టారు. బెయిల్  రాకుండా ఉండేందుకు ఇంకా కొన్ని  పాత కేసులను జతచేసి చేసి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు రిమాండ్​ విధించింది.
కాగా, సోమవారం ఉద్యమ మానకొండూరు పీఎస్​ నుంచి పీటీసీకి సంజయ్​ని తరలిస్తున్నారని తెలుసుకొని అక్కడికి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి సహా పలువురు నేతల వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పీటీసీ వద్దకు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి వచ్చారు. బండి సంజయ్ మీద రిమాండ్ కేస్ డైరీలో గతంలో కరీంనగర్, సిరిసిల్ల, బోయిన్​పల్లి, మల్యాల పోలీస్ స్టేషన్లలో ఆయనపై నమోదైన కేసులను తాజాగా కోర్టు ముందు ఉంచారు.