బండి సంజయ్ అరెస్ట్ పై మండిపడుతున్న బిజెపి నేతలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికార పక్షానికి ఓ న్యాయం.. ప్రతిపక్షానికి ఓ న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.
మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ మాస్కులు లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేస్తున్నారు. అరెస్టులు, నిర్బంధం, కేసుల ద్వారా రాజ్యం నడపలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరుపున బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
కరోనా నిబంధనలను సీఎం కేసీఆర్‌ సహా ఆ పార్టీ నేతలు పాటించడం లేదని.. టీఆర్‌ఎస్‌ నేతల చర్యలు పోలీసులకు కనిపించడం లేదా అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఒక చట్టం.. ఇతరులకు మరో చట్టమా అంటూ దుయ్యబట్టారు. బండి సంజయ్‌ను అక్రమంగా చేసి జైలుకు పంపించారని  కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతూ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. బీజేపీని అడ్డుకోవడానికి, ఉద్యమాలను అణచివేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తమను చంపినా.. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
కేసీఆర్‌ను గద్డె దించాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. బండి సంజయ్ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, 317 జీవో సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఫామ్ హౌజులో కూర్చోని రాత్రికి రాత్రి జీవోలు తీసుకువస్తున్నారని ఆమె  విమర్శించారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విజయశాంతి  మండిపడ్డారు. బండి సంజయ్ ని లాక్కెళ్లడం, మహిళల చీరలు లాగేయడం, కార్యకర్తలపై లాఠీ ఛార్జీ చేయడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్‌కు లేని కరోనా నిబంధనలు, బీజేపీకి వర్తిస్తున్నాయా? దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు విజయశాంతి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయాయని ఆమె తీవ్రంగా ఆరోపించారు. తాము దీక్షలకు పిలుపునిచ్చినప్పడే కాంగ్రెస్ చేత దీక్షలు పెట్టిస్తున్నారంటూ ఆమె విమర్శించారు.
కేసీఆర్ చేసిన పాపాలు కూడా త్వరలోనే ప్రజలకు తెలుస్తాయని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ ఓ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తాడని ఆమె దుయ్యబట్టారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో బావిలోపడి మనిషి చనిపోయినా.. అది బయటకు రావడం లేదంటూ ధ్వజమెత్తారు. ఏమైనా నరబలి ఇస్తున్నాడా..? అని ఆమె ప్రశ్నించారు.
కాగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ నిరసనగా ఆపార్టీ నేతలు జిల్లాల్లో ఆందోళనకు దిగారు. దాంతో వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పీ అర్వింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘనందనరావు, బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డిలతో సహా ముఖ్యనేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. వారిని హౌస్ అరెస్ట్ చేసి ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.
ఇన్నాళ్లు ఫామ్ హౌస్‌లో పడుకున్న కేసీఆర్ హడావిడిగా జీవో 317 తీసుకొచ్చారని నిజామాబాదు ఎంపీ అర్వింద్ విమర్శించారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నార‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో ఎందుకు సంప్రదింపులు జరపడం లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ పార్టీ నేతలకు తొత్తుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు బిజెపి అంటే భయం పట్టుకుందని పేర్కొన్నారు. కనీసం భార్య, పిల్లల దగ్గరకు కూడా పోనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పతన మొదలైందని హెచ్చరించారు.
సంజయ్ ని అరెస్ట్ చేస్తుండగా జరిగిన ఘర్షణలో రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి కాలు విరిగింది. సంజయ్ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసుల దౌర్జన్యం చేశారని.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు కాలిబూట్లతో తొక్కి దారుణంగా ప్రవర్తించారని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మహిళా మోర్చా ప్రెసిడెంట్ కృష్ణవేణి మండిపడ్డారు.

బీజేపీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ అరెస్ట్

బీజేపీ సోషల్ మీడియా విభాగం స్టేట్ కన్వీనర్ సతీశ్​​ చంద్రను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై పోలీసులు సతీష్ చంద్రను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ లో ఉ౦డే తల్లి వద్దకు వచ్చిన ఆయనను నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హైదరాబాద్​కు తరలించారు. సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్న సతీశ్​ చంద్రను అరెస్టు చేయడం అక్రమమంటూ బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.