కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలైంది

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పతనం ప్రారంభమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి  డీకే అరుణ స్పష్టం చేశారు. కేసీఆర్ కు ప్రజలు చరమ గీతం పాడుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం సిగ్గు మాలిన చర్య అని ఆమె మండిపడ్డారు.
 
కరోనా నిబంధనలు కేవలం బీజేపీకి మాత్రమే వర్తిస్తాయా? టీఆర్ఎస్ బహిరంగ సభలు ,సమావేశాలు పెట్టినప్పుడు ఏ నిబంధనలు గుర్తు రాలేదా? అని ఆమె ప్రశ్నించారు. పోలీసులు కండువా వేసుకొని టీఆర్ఎస్ కార్యకర్తల్ల వ్యవహరిస్తున్నారని అరుణ ధ్వజమెత్తారు. 
 
కేసీఆర్ నియంత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, వారిని పాతాళానికి తొక్కెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. అరెస్టులు కేసులతో భయపడే ప్రసక్తే లేదని, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు.
అధికార పక్షానికి ఓ న్యాయం..ప్రతిపక్షానికి ఓ న్యాయమా అని బిజెపి నేతలు ప్రశ్నించారు. మంత్రులు కేటీఆర్, గంగుల మాస్క్ లు లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. నిర్బంధం, కేసుల ద్వారా రాజ్యం నడపలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరుపున బీజేపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
 
అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న పోలీసులు 
 
పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ఈటల రాజేందర్ విమర్శించారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన తీరు ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. అధికార పార్టీ కరోనా పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
నల్గొండలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటనలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని, అప్పుడు అడ్డురాని కరోనా ఇప్పుడు అడ్డొచ్చిందా అని ఆయన  ప్రశ్నించారు. జీవో 317తో టీచర్లకు, ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. 
 
కరోనా నిబంధనలను పాటిస్తూ సంజయ్ తన కార్యాలయంలో జాగరణ కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేస్తుంటే.. ఏదో శత్రు సైన్యంతో ఘర్షణ పడినట్టుగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ వ్యవహరించారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు, ఉద్యోగుల పక్షాన నిలబడిన బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. 
 
టీఆర్ఎస్‌కు రాబోయే రోజుల్లో చెడు అనుభవాలు తప్పవని ఈటెల హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్ తన సొంత రాజ్యంగం అమలు చేస్తూ.. ఒక చక్రవర్తిలా పాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  బీజేపీ కేసులకు భయపడదని స్పష్టం చేస్తూ  హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్‌‌ఎస్ ఆగమవుతోందని, కాళ్ల కింద భూమి కదులుతోందని ఎద్దేవా చేశారు.