మీడియాలో చాలా మందికి బిజెపి, మోదీ పట్ల ద్వేషం

తమిళనాడు భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలోని చాలా మంది జర్నలిస్టులపై ఘర్షణ బాటలో ఉన్నారు. మీడియా సమావేశాలలో జర్నలిస్టులకు ఎదురు ప్రశ్నలు వేయడం నుండి కొందరు  జర్నలిస్టులకు వ్యతిరేకంగా ట్వీట్ చేయడం వరకు రాజకీయ నాయకుడుగా మారిన మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి గత కొన్ని వారాలుగా వార్తలలో నిలుస్తున్నారు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుండి నిధుల కేటాయింపులో తమిళనాడును కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందన్న అభిప్రాయాన్ని కలిగించే విధంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇటీవలి ఓ కధనాన్ని ప్రచురించింది. 

 
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించిన వరదల నేపథ్యంలో సహాయ, పునరుద్ధరణ కోసం రూ 6,230 కోట్ల సాయం కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పలు వినతిపత్రాలను పంపినప్పటికీ తమిళనాడుకు కాకుండా, ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించారని అంటూ ఆ కధనంలో పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాలకు ఇటీవలి కేటాయించిన విపత్తు నిధులు అన్ని  మే 2021లో సంభవించిన విపత్తుల కోసం అని విమర్శకులు ఎత్తిచూపారు. తమిళనాడు  ఆ తర్వాత సంభవించిన విపత్తుల కారణంగా ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడానికి సహాయ నిధులను కోరడం గమనార్హం.

తమిళనాడు అవసరాలు, వాటి పరిమాణం గురించి కేంద్రం కసరత్తు చేస్తున్నాదని, త్వరలో ఈ ప్రకియ పూర్తి అవుతుందని ఈ సందర్భంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి కోసం కేంద్రం ఇప్పటికే మరో రూ.1,030 కోట్లు విడుదల చేసిందని కూడా చెబుతున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా సమస్యలపై మెరుగైన పరిశోధన చేస్తుందని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే ఈ కధనం ఆ జర్నలిస్ట్ `వ్యక్తిగత పక్షపాతం’ అర్ధ సత్యాలతో, ఒక అజెండాతో నడిచే కధనం ఈ గౌరవనీయ పత్రికలో వెల్లడవుతోందని అంటూ విచారం వ్యక్తం చేశారు.

అన్నామలై నిర్దిష్ట విమర్శలు, వ్యాఖ్యలపై చాలా మంది ద్రావిడ్ మున్నేట్ర కజగం (డీఎంకే) అనుకూల జర్నలిస్టులు ఉలిక్కిపడగా, ‘మీతో సహా తమిళనాడులోని కొంతమంది జర్నలిస్టులు మా గౌరవనీయులైన ప్రధాన మంత్రి, తమిళ నాడు బీజేపీపై చాలా సంవత్సరాలుగా ద్వేషం కలిగి ఉన్నారు’ అని ఆయన నిర్మహమాటంగా తేల్చి చెప్పారు. “మీరు మీ కధానాలలో ‘వ్యక్తిగత పక్షపాతం’ను ముందుకు తెచ్చేవారిని నేను లక్ష్యంగా చేసుకుంటూనే ఉంటాను” అని స్పష్టం చేశారు.

అన్నామలై విలేకరుల సమావేశాలకు సంబంధించిన అనేక వీడియో క్లిప్‌లు, జర్నలిస్టులను ఎదురుప్రశ్నలు, పక్షపాత ఆరోపణలతో ఎదుర్కొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక క్లిప్‌లో అన్నామలై ‘మేము ఇలా స్పందిస్తాము. తమిళనాడు మీడియా ఛానెల్‌లు నిజాయితీగా, న్యాయంగా మారినప్పుడు మేము కూడా మా స్వరం మారుస్తాం’ అని స్పష్టం చేశారు.