ప్రతికూల వాతావరణమే బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్ ప్రమాదం

ప్రతికూల వాతావరణమే ఆర్మీ స్టాఫ్‌ ఆఫ్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మంది చెందిన హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘కోర్టు ఆఫ్‌ ఎంక్వయిరీ’లో నిర్ధారించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
గత నెల 8న తమిళనాడులోని కూనూర్‌కి సమీపంలో రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వి5 హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు ప్రతికూల వాతావరణంలోకి వెళ్లి చిక్కుకుపోయిందని, అంతే తప్ప అందులో ఎలాంటి సాంకేతిక, యాంత్రిక తప్పిదాలు దొర్లలేదని నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తోంది. 
 
 ఆ రోజు వాతావరణం బాగలేకపోవడంతో దట్టమైన పొగమంచు కారణంగా ముందు ఏమీ కనిపించని పరిస్థితి ఉందని, హెలికాప్టర్ క్రాష్​కావడానికి ఇదే కారణం కావచ్చని ఆర్మీ వర్గాలు చెప్పాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే అనుకోకుండా హెలికాప్టర్ చెట్లను ఢీకొట్టి క్రాష్​అయి ఉండొచ్చని ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో ఒక నిర్ణయానికి వచ్చారని చెప్తున్నారు. హెలికాప్టర్ లో సాంకేతిక, మెకానికల్ లోపాలకు ఎలాంటి అవకాశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
 
ఈ నివేదికను త్వరలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరికి సమర్పించనున్నారు. ప్రస్తుతం తుది నివేదికను వైమానిక దళం న్యాయవిభాగం పరిశీలిస్తోంది. కాగా, ఈ నివేదికపై ప్రభుత్వం గానీ..వైమానిక దళం గానీ.. ఇప్పటి వరకు స్పందించలేదు.