నేటి నుండి 15 -18 ఏళ్ల వయసు పిల్లలకు టీకాలు

యుక్త వయసువారికి కూడా వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం నుండి దేశవ్యాప్తంగా 15 -18 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. వీరితో పాటు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులు మరియు పౌరులకు మూడో డోసు కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 

అందులో భాగంగా.. ఈ నెల 10వ తేదీ నుంచి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న 60 ఏళ్లు పైబడినవారికి బూస్టర్‌ డోస్‌ ఇవ్వనున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం వీరందరికీ కోవాగ్జిన్‌ టీకాల పంపిణీకి అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు పూర్తి చేశారు. 

 అధికారులు.. జిల్లాల వారీగా ఉన్న 15-18 ఏజ్‌ గ్రూప్‌ గణాంకాలను తీసి తమకు ఇన్ని వ్యాక్సిన్‌లు కావాలని ప్రభుత్వానికి చెప్పడం.. ఆ మెరకు వారికి వ్యాక్సిన్లు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఆదేశించినట్లుగా, భారత్‌ బయోటెక్‌ వారి  కోవాక్సిన్‌ టీకాను మాత్రమే ఇవ్వనున్నారు.

ఇలా ఉండగా, కరోనా  కట్టడికి దేశంలో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద విజయవంతమైన కార్యక్రమమని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కొన్ని మీడియాల్లో వ్యాక్సినేషన్ లక్షాలను చేరుకోలేకపోయామంటూ తప్పుదోవ పట్టించే కథనాలొచ్చాయని ఆరోగ్యశాఖ విమర్శించింది. 
 
ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాలో తప్పుదోవ పట్టించే విశ్లేషణ చేశారని, అది అసంపూర్ణ కథనమని తెలిపింది. గతేడాది జనవరి 16న చేపట్టిన వ్యాక్సినేషన్ ద్వారా అర్హులైన పౌరులకు ఇప్పటివరకు 90 శాతంకుపైగా మొదటి డోస్, 65శాతం వరకు రెండు డోసుల పంపిణీ పూర్తయిందని ఆరోగ్యశాఖ తెలిపింది.
 
తక్కువ జనాభా కలిగిన పలు అభివృద్ధి దేశాలకన్నా మన దేశంలో వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయగలిగామని తెలిపింది. 100 కోట్ల డోసుల మైలురాయిని 9 నెలల్లోపే పూర్తి చేశామని, పలుమార్లు ఒకేరోజు కోటి డోసుల పంపిణీ జరిగిందని, ఓరోజు రికార్డుస్థాయిలో 2.51 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని గుర్తు చేసింది.

మొదటి డోస్‌ను అమెరికా తమ జనాభాలోని 73.2శాతానికి, యుకె 75.9 శాతం, ఫ్రాన్స్ 78.3 శాతం, స్పెయిన్ 84.7 శాతానికి పూర్తి చేశాయని ఆరోగ్యశాఖ తెలిపింది. రెండో డోస్‌ను అమెరికా 61.5శాతానికి, యుకె 69.5 శాతం, ఫ్రాన్స్ 73.2 శాతం, స్పెయిన్ 81 శాతం పూర్తి చేశాయని తెలిపింది. మన దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు (యుటిలు)మొదటి డోస్‌ను 100 శాతం పూర్తి చేశాయి. 

మూడు రాష్ట్రాలు, యుటిలు రెండో డోస్‌ను 100 శాతం పూర్తి చేశాయి. చాలా రాష్ట్రాలు 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా ముందుకు సాగుతున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివకే 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, ఈ నెల 3 నుంచి 1518 ఏళ్ల టీనేజర్లకు ప్రారంభించనున్నది.