దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివిటీ కేసుల దృష్ట్యా రెడ్ అలర్ట్ ప్రకటించేందుకు చేరువలో ఉందని, తద్వారా ఢిల్లీలో పూర్తి స్థాయి కర్ఫూ విధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 3,194 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతిచెందారు.
గత ఏడాది మే 20 నుంచి ఇంత పెద్దసంఖ్యలో కేసులు పెరగడం ఇదే మొదటిసారి. ఆదివారం 4.9 శాతం పాజిటివిటీ రేటు నమోదైనట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ నిర్ధారించిన ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ ప్రకారం రెండు రోజులు వరుసగా 5 శాతం కంటే పాజిటివిటీ రేటు నమోదైతే ‘రెడ్ అలర్ట్’ ప్రకటించాల్సి ఉంటుంది.
అదే జరిగితే పూర్తి స్థాయి కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిపేస్తారు. గత ఏడాది మే 20న 3,231 కేసులతో 5.50 శాతం పాజిటివిటీ రేటు నమోదు కాగా, ఆ ఒక్కరోజే 233కు పైగా మరణాలు రికార్డయ్యాయి.
కాగా, ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. ‘‘కరోనా కేసులు పెరుగుతున్నాయి కానీ, ఆసుపత్రిలో చేరే కేసులు తగ్గుతున్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు’ అని ప్రజలకు ధైర్యం చెప్పారు.
ప్రస్తుతం చాలా కరోనా కేసులు తేలికపాటి తేలికపాటి లక్షణాలతో నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. చాలామంది కరోనా రోగులు ఆసుపత్రుల్లో చేరకుండానే కోలుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీలో 246 ఆసుపత్రుల్లో దాదాపు 37 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని, ప్రస్తుతానికి 82 బెడ్స్‌లో మాత్రమే కరోనా రోగులు ఉన్నారని కేజ్రీవాల్ వివరించారు.
రెండో వేవ్‌తో పోలిస్తే ప్రస్తుతంకరోనా తీవ్రత తక్కువగా ఉందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలని చెప్పారు.
పశ్చిమబెంగాల్‌లో కరోనా కేసులు పె రుగుతుండడంతో రాష్ట్రప్రభుత్వం కరోనా కట్టడికి ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. సోమవారం నుం చి స్కూళ్లు, కాలేజీలు తదితర విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. కార్యాలయాలు, సినిమా హాళ్లు, థియేటర్లు, 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతించింది.
పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మిల్లులు, తేయాకు తోటలు తదితర వాణిజ్య సంస్థల యాజమాన్యాలు కచ్చితంగా కొ విడ్ నిబంధనలు పాటించాలని ష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కె ద్వివేది కోరారు. రోజూ రాత్రి 10 నుంచి తెల్ల వారు జాము 5 గంటల వరకు మాత్రమే అత్యవ సర సర్వీసులను అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. బార్లు, రెస్టారెంట్లు సగం సిబ్బందితో రాత్రి 10 గంటల వరకే పనిచేస్తాయి.
మహారాష్ట్రలో జనవరి మూడోవారం వరకల్లా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరుతుందని ఆ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రదీప్‌వ్యాస్ అంచనా వేశారు. వీరిలో కొందరిని ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు కేసులు పెరుగుతున్నతీరును బట్టి ఈ అంచనా వేశామని తెలిపారు.
కేసుల పెరుగుదలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక ఆదేశాలిస్తామని చెప్పారు. ఒమిక్రాన్ వల్ల వచ్చే మూడో ఉధృతి స్వల్ప లక్షణాలతోనే ఉంటుందని, ప్రమాదమేమీ ఉండబోదంటూ నిర్లక్షం వహించొద్దని వ్యాస్ సూచించారు.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 33,750 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 123 మంది బాధితులు చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.48కోట్లు దాటింది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,81,993 మంది ప్రాణాలు కోల్పోయారు.
గత 24 గంటల్లో కరోనా నుంచి 9249మంది కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.42 కోట్లకు పైగా మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,582మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 145.68 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.
More Stories
అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలా సీతారామన్