తెలంగాణలో రూ 272 కోట్ల మద్యం అమ్మకాలు

తెలంగాణలో రూ 272 కోట్ల మద్యం అమ్మకాలు
ఒక వంక కరోనా మహమ్మారి మూడు వెప్ తెలంగాణాలో ప్రారంభమైనది స్వయంగా రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ ప్రకటించినా, కరోనా నిబంధనల అమలు పట్ల రాష్ట్ర హైకోర్టు వారించినా పట్టించుకొనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మద్యం మత్తులో ముంచేయడం పట్ల మాత్రం తీవ్ర ఆసక్తి కనబరిచింది. దానితో ఎన్నడూ లేనంతగా నూతన సంవత్సరం సందర్భంగా రెండు రోజులలో రూ 272 కోట్ల మేరకు మద్యం అమ్మకాలతో రికార్డు సృష్టించారు. 
 
పైగా, ఈ అమ్మకాలలో సింహభాగం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే జరగడం గమనార్హం. అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం అమ్మకాలను యథేచ్ఛగా ప్రోత్సహించినట్లు స్పష్టం అవుతుంది. దాదాపు తెల్లవార్లూ అన్ని మద్యం షాపులు, బారులు, పబ్ లు తెరచి ఉండడం, యువత మద్యం మత్తులో నగరంలో వాహానాలపై స్వైరవిహారం చేసినా చూసి, చూడన్నట్లు ఉండడంతోనే ఈ భారీ అమ్మకాలు సాధ్యమైన్నట్లు భావిస్తున్నారు. 
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2021లో జరిగిన మద్యం విక్రయాలు అత్యధికమని ఆబ్కారీ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. డిసెంబర్ 31వ తేదీన సుమారు రూ.171.93 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, రెండోరోజూ శనివారం (జనవరి 1)న సుమారుగా రూ.100 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. 
 
డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 01వ తేదీ వరకు (6 రోజులను) కలిపి సుమారుగా రూ.1,000 కోట్ల మద్యం అమ్మకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా డిసెంబర్ నెలలో 3,435 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా గత సంవత్సరం డిసెంబర్‌లో 2,764 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2020లో 25,602కోట్ల మద్యం అమ్ముడుపోగా, 2021 డిసెంబర్ 31వ తేదీ నాటికి రూ.32 వేల కోట్ల పైచిలుకు మద్యం విక్రయాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి.
 
కాగా,  నూతన సంవత్సర ​ వేడుకల సందర్భంగా శుక్రవారం రాత్రి మత్తుగా తాగిన యువకులు బండ్లు నడుపుతూ.. డ్రంకెన్ ​డ్రైవ్​లో పట్టుబడ్డారు. రాష్ట్రంలో ఒక్క రోజే 3,749 మంది పోలీసులకు చిక్కారు. గ్రేటర్ ​హైదరాబాద్ ​మూడు పోలీస్ ​కమిషనరేట్ల పరిధిలో 2,498 కేసులు నమోదయ్యాయి. పట్టుబడ్డ వారిలో 80 శాతం మంది  యువకులే ఉండటం గమనార్హం