హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన షేక్ పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ఆయన రాష్ట్ర మంత్రి కెటి రామారావుతో కలసి పాల్గొంటూ నగర వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

నగరం రోజురోజుకు విస్తరిస్తోందని, ఇక్కడికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా వచ్చి జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అందరం కృషి చెయ్యాలని సూచించారు. గడిచిన 75 సంవత్సరాలలో ఎన్నో జాతీయ రహదారులు నిర్మించారని చెప్పారు. 

అయితే గత ఏడు సంవత్సరాలలో అంతకన్నా ఎక్కువ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో సైన్స్ సిటీ ఏర్పాటు చేయాలని చెబుతూ అందుకోసం 25 ఎకరాల భూమి అవసరం అని చెప్పారు. 

అదేవిధంగా సెవెన్ టొంబ్స్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వదేశీ దర్శన్ పథకంలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చినది చెబుతూ దానికి సంబంధించిన భూమి త్వరగా సేకరిస్తే తొందరగా అందుబాటులోకి వస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

 రూ. 333 కోట్లతో 2.7 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా మెహదీపట్నం – హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్,  ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.