పంజాబ్ లోక్ కాంగ్రెస్‌తో బీజేపీ పొత్తు

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్  ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక శిరోమణి అకాలీదళ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈసారి అమరీందర్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. 
 
ఈ కూటమిలో సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) పార్టీ కూడా ఉంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అమరీందర్, దిండ్సా తాజాగా బీజేపీ అధినేత జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా సహా సీనియర్ బీజేపీ నేతల్ని ఢిల్లీలో కలుసుకున్నారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పంజాబ్ బీజేపీ ఇంచార్జ్‌ షేకావత్ మాట్లాడుతూ ‘‘పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) పార్టీలతో కలిసి భారతీయ జనతా పార్టీ దిగుతోంది” అని ప్రకటించారు.
 తొందర్లోనే ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నేతలతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిటీ ఒకొక్క పార్టీ పోటీ చేసే స్థానాలను గుర్తిస్తుంది. ఆ జాబితాను బిజెపి కేంద్ర కమిటీకి అందిస్తారు. ఉమ్మడిగా ఎన్నికల ప్రణాలికను కూడా ఈ కమిటీ రూపొందిస్తుంది.
ఈ ఎన్నికలలో తమ కూటమి విజయం సాధింపగలదని షెక్వాట్ ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో పరాకాష్టకు చేరిన కుమ్ములాటలు కారణంగా రాష్ట్రం భారీ మూల్యం చెల్లిస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ఇటీవల జలంధర్ కోర్ట్ లో జరిగిన పేలుడు అందుకు ఉదాహరణ అని చెప్పారు.