ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభించాలి… ఎబివిపి డిమాండ్

ఆన్‌లైన్ బోధన సమయంలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నందున పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఆఫ్‌లైన్ చదువులను తిరిగి ప్రారంభించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించినట్లు దాని జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి తెలిపారు.

ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ, హోం మంత్రిత్వ శాఖలు, ముఖ్యమంత్రులు తదితరులకు వినతి పత్రాలు సమర్పిస్తామని ఆమె చెప్పారు.

“చాలా విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం ట్యూషన్ ఫీజుతో సహా పూర్తి ఫీజులను వసూలు చేస్తోంది. విద్యార్థులు లైబ్రరీ, ఇతర అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌లకు కూడా ఫీజులు చెల్లిస్తారు, అయితే చదువులు ఆన్‌లైన్‌లో ఉన్నందున క్యాంపస్ సౌకర్యాలను ఉపయోగించుకోవడం లేదు”అని ఆమె గుర్తు చేశారు.

 
ఓమిక్రాన్  ముప్పు మధ్య ఆఫ్‌లైన్ డిమాండ్ గురించి అడిగినప్పుడు, త్రిపాఠి కరోనా టీకాల కార్యక్రమం వేగంగా జరుగుతున్నదని, ప్రభుత్వం ఇప్పుడు 15-18 సంవత్సరాల వయస్సు గల వారికి కూడా టీకాలు వేయడానికి అనుమతించిందని గుర్తు చేసారు.
 

 డాక్టరేట్ లేదా ఇతర పరిశోధనలు చేస్తున్న మహిళలకు 240 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరుతూ మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో మూడు రోజులపాటు జరిగిన జాతీయ మహాసభలలో తీర్మానం కూడా ఆమోదించినట్లు ఆమె తెలిపారు.

సమావేశంలో ఆమోదించిన మరో తీర్మానం ప్రకారం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని ప్రభుత్వాలను  ఎబివిపి కోరింది.  అందులో దేశ వ్యాప్తంగా 665 మంది ప్రతినిధులు వ్యక్తిగతంగా 70,000 మంది వర్చ్యువల్ గా హాజరయ్యారు, నేపాల్, బంగ్లాదేశ్ నుండి కూడా కొంతమంది విద్యార్థులు పరిశీలకులుగా పాల్గొన్నారని ఆమె వివరించారు.