యుపిలో 300 సీట్లతో బీజేపీదే తిరిగి అధికారం!

వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా సీట్ల గెలుచుకుని అధికారం నిలబెట్టుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్, జలన్ లలో అమిత్ షా ప్రచారం సభలలో మాట్లాడుతూ సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కులతత్వ పార్టీలని ఆరోపించారు.
ఐదేళ్ల యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్ నుంచి గూండాలంతా పారిపోయారని కొనియాడారు. గతంలో సామాన్య ప్రజలు భయంతో రాష్ట్రం విడిచి వెళ్ళేవారని, కానీ ఇప్పుడు నేరస్థులు పారిపోవలసి వస్తుందని ఆయన చెప్పారు.  అఖిలేష్ ఐదేళ్ల పాలనలో 700కు పైగా దమ్మీలు జరిగాయని గుర్తు చేశారు.  యోగి ఆదిత్యనాథ్ పాలనలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఇప్పుడు తల్లితండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి భయపడటం లేదని తెలిపారు.
 “ఇంతకుముందు, శాంతిభద్రతల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండెడిది. ప్రజలు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి వెనుకాడేవారు. కానీ ఐదేళ్ల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో, గూండాలందరూ యుపి నుండి వలస వెళ్ళారు” అని ఆయన జన్ విశ్వాస్ యాత్రను ఉద్దేశించి కాస్గంజ్‌లో ప్రసంగిస్తూ పేర్కొన్నారు. 
బీఎస్పీ, ఎస్పీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని, రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు అభివృద్ధికి పాటుపడలేదని కేంద్రమంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగించడం కోసం 2014, 2017, 2019 త‌ర్వాత రాష్ట్రంలో బిజెపికి వ‌రుస‌గా నాలుగవ సారి విజ‌యాన్ని అందించాల‌ని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని బిజెపి మాత్రమే “సర్వ సమాజ్” లేదా మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలదని ఆయన తెలిపారు. గత ఎస్పీ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ, గతంలో ప్రతి జిల్లాలో ఒక బాహుబలి (రాజకీయ బలవంతుడు), ఒక మినీ-సీఎం, స్కామ్ ఉండేవారని అమిత్ షా ధ్వజమెత్తారు.
దీనికి విరుద్ధంగా, బిజెపి ప్రభుత్వ హయాంలో, ప్రతి జిల్లాలో ఒక ఉత్పత్తి (ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం), ఒక పరిశ్రమ , ఒక వైద్య కళాశాల ఉన్నాయని చెప్పారు. వారణాసిలో ఇటీవల ప్రధాని ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ గురించి షా మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షణలో పవిత్ర స్థలం నిర్మానుష్యంగా కనిపించేదని, ఇప్పుడు దీనిని అందంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. 
బాబ్రీ మసీదు కూల్చివేత ప్రస్తావనలో ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని వదులుకోవడం ద్వారా అయోధ్యలో రామమందిరానికి “మార్గాన్ని సుగమం చేసినందుకు” కొద్దినెలల క్రితం మరణించిన మాజీ ముఖ్యమంత్రి,  ఓబిసి నాయకుడు కళ్యాణ్ సింగ్ వారసత్వాన్ని కూడా అమిత్ షా ఈ సందర్భంగా ప్రశంసించారు.
1992లో సుపరిపాలన గురించి . వెనుకబడిన కులాల ప్రజలకు వారి హక్కులను అందించడం గురించి మాట్లాడిన మొదటి వ్యక్తి కళ్యాణ్ సింగ్ అని గుర్తు చేశారు. బాబూజీ (సింగ్) తనకు మార్గదర్శనం అందించకపోతే 2014, 2017, 2019లో విజయాలు సాధించి ఉండేది కాద‌ని ఆయన తెలిపారు.