ఏడేళ్ల పాలనపై బహిరంగ చర్చ … కేసీఆర్ కు బిజెపి సవాల్

 ఏడేళ్ల మోదీ పాలన.. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిజెపి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్ చుగ్ సవాల్ విసిరారు. 
 
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చేపట్టిన `నిరుద్యోగ దీక్ష’లో ముఖ్య అతిధిగా పాల్గొంటూ ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం పోరాడిన యువతను సీఎం కేసీఆర్ మరిచిపోయారని మండిపడ్డారు. 
తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా పడ్డాయని చెప్పారునై, ప్రతీ ఇంటికి ఉద్యోగం కల్పిస్తామన్నారని అంటూ ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాయమాటలు చెప్పి.. నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయ‌ని ఆరోపించారు.   నిరుద్యోగ దీక్షకు వస్తున్న నేతల్ని అరెస్ట్ చేయడం సరికాదని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమ ద్రోహులకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని తరుణ్ చుగ్ విమర్శించారు. ఉద్యోగాలు లేక అనేకమంది యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ చేస్తామన్న తన ఇంటిని మాత్ర‌మే బంగారంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.
 
 ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తామన్న ఆ హామీ ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నించారు. డిగ్రీలు, చదువులు మాని తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొందని చెబుతూ ఆ యువత చేసిన పోరాటంతో కేసీఆర్ అధికార పీఠం ఎక్కారని స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
ప్రధాని మోదీ ప్ర‌భుత్వం దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిందని గుర్తుచేశారు. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ బీ టీంగా పనిచేస్తోందని ఆరోపించారు. బంగారు తెలంగాణ వచ్చే వరకు ప్రతీ బీజేపీ కార్యకర్త పోరాడాలని పిలుపు నిచ్చారు. 
రాష్ట్రం కోసం పోరాడి.. ఉద్యోగం కోసం చనిపోవద్దు

పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి చెప్పారు. కానీ ఇవాళ రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందని, పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడి… పెంచి పెద్ద చేస్తారని పేర్కొన్నారు. 

అలాంటి పిల్లలు ఇవాళ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెబుతూ అలాంటి నిరుద్యోగులంతా తమ తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు పోరాటం చేయాలని పిలుపిచ్చారు. ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని చెబుతూ ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన యువత… ఇవాళ ఉద్యోగం కోసం చనిపోవడం సరైన నిర్ణయం కాదని ఆమె హితవు చెప్పారు. 

ప్రతీ సమస్యకు అనేక పోరాటాలని, పిరికితనం కాదు ఎదురు తిరగాలని ఆమె ఉద్బోధించారు. కేసీఆర్ ప్రభుత్వంపై యువత పోరాడాలని విజయశాంతి చెప్పారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్ ఏడేళ్ల పాటు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తే.. జీతాలు ఇవ్వాలని, కానీ జీతాలు ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదని ఆమె  విమర్శించారు. 

” మీ కోసం భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది” అంటూ ఆమె యువతకు భరోసా ఇచ్చారు.  ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిరుద్యోగుల కోసం పోరాడాలని ఆమె కోరారు. “ఉద్యోగులు పెన్ డౌన్ చేయమని నేను అడగడం లేదు కానీ.. ఓ గంట పాటు నిరుద్యోగాల కోసం గొంతు విప్పాలి. మీ తమ్ముళ్లకు ధైర్యం చెప్పాలి” అంటూ ఆమె పిలుపిచ్చారు. 

ప్రభుత్వాన్ని కూల్చివేసే ధైర్యం సత్తా యువతకు ఉందని పేర్కొంటూ మీకోసం బిజెపి ఉన్నదని ఆమె చెప్పారు. ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి , పొంగులేటి సుధాకర్ రెడ్డి, స్వామి గౌడ్ , ఇత‌ర నేత‌లు కూడా దీక్ష‌లో కూర్చున్నారు.  బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు మెడికల్, హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు నేరుళ్ల గంగారెడ్డి సంఘీభావం తెలిపారు. 

ఇటీవల  ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి రవీంద్ర నాయక్ భార్య రజిత ఆమె  పిల్లలు బీజేపీ నిరుద్యోగ దీక్షలో పాల్గొన్నారు. తన భర్త తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడన్నారు.   పీహెచ్ డీ చేసిన తన భర్త ఉద్యోగం రాలేదనే ఆవేదనతో ఆత్మ హత్య చేసుకున్నాడన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నోటిఫికేషన్ లు జారీ చేయాలని కోరారు. తనకు వచ్చిన కష్టాలు మరొకరికి రావొద్దంటూ ఆవేదన చెందారు. 
 
కాగా, తొలుత ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగ దీక్ష చేయాలని భావించారు. అయితే, ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోనే నిరుద్యోగ దీక్ష చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 
 
ఎంపీ అర్వింద్ గృహ‌నిర్బంధం
 
 మరోవైపు పలు జిల్లాల నుంచి బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష‌కు తరలివస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను పోలీసులు గృహనిర్భంధం చేశారు. మహాబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్ , ఆదిలాబాద్ జిల్లా నుంచి దీక్ష‌కు బయలుదేరిన కమలం నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. 
 
పోలీసుల అరెస్ట్‌ల‌ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
 
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి నిరుద్యోగులను పట్టించుకోవ‌డం లేద‌ని బండి సంజయ్ మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడ‌ద‌ల చేయ‌డం లేద‌ని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు లేక 600 మంది నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని చెప్పారని చెబుతూ  నిరుద్యోగ దీక్షకు వ‌స్తున్న విద్యార్థుల‌ను, నిరుద్యోగుల‌ను అడ్డుకుని అరెస్టు చేయ‌డం ఎంటి అని ప్ర‌శ్నించారు. 
 
తాను దీక్ష చేస్తే.. కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నాడ‌ని బండి విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా చేపడుతున్న దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్ నియంత, అహంకార పాలనకు నిదర్శనం అని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
సంజయ్ దీక్ష నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. అటు నిరుద్యోగ దీక్ష చేస్తోన్న బండి సంజయ్‌కు గోనె ప్రకాశరావు సంఘీభావం తెలిపారు.