వ్యాక్సినేషన్‌ విషయంలో అద్భుతమైన పురోగతి

ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్‌ విషయంలో మనదేశం అద్భుతమైన పురోగతి సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  తెలిపారు. 140 కోట్ల డోసుల మైలురాయిని దాటడం ప్రతి భారతీయుడి విజయంగా ఆయన అభివర్ణించారు. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ గుట్టు విప్పేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ అవగాహనతో క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌పై పోరులో స్వీయ అప్రమత్తత, క్రమశిక్షణే దేశానికి అతిపెద్ద బలమని ప్రధాని స్పష్టం చేశారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ లో ప్రధాని  మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో పుస్తక పఠనాన్ని మరింత ఆసక్తిగా మారుద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 

తమిళనాడులో ఇటీవల వాయుసేన హెలికాప్టర్‌ కూలి గాయాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ను గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆగస్టులో శౌర్యచక్ర పురస్కారం అందుకున్న గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌, చిన్ననాటి స్కూల్‌ ప్రిన్సిపల్‌కు రాసిన లేఖ చదివిన తరువాత తన హృదయం బరువెక్కిందని తెలిపారు. 

బాగా మార్కులు రాకపోయినా, ఏ రంగం ఇష్టమో గుర్తించి, అంకిత భావంతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని వరుణ్‌ లేఖలో పేర్కొన్నారని చెప్పారు. విమానయాన రంగమంటే ఆసక్తితో కృషి చేసి శౌర్య చక్ర అవార్డు దక్కించుకున్నానని వరుణ్‌ లేఖ రాసినట్లు మోడీ గుర్తు చేశారు. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఆయన తన మూలాల్ని మరిచిపోలేదని కొనియాడారు. 

 ‘మన శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. వారికి ప్రతిరోజూ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఆ సూచనలపై పని చేస్తున్నారు.’ అని తెలిపారు. ఇప్పటి వరకు 140 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను వేసినట్లు తెలిపారు.

ఈ సంవత్సరం కూడా పరీక్షలకు ముందు విద్యార్థులతో చర్చించాలని ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఈ నెల 28 నుంచి జనవరి 20 వరకూ మై గవ్‌ డాట్‌ ఇన్‌ లో ప్రారంభమవుతుందని వెల్లడించారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఆన్‌లైన్‌ పోటీలను కూడా నిర్వహిస్తామని ప్రధాని తెలిపారు.

తెలంగాణకు చెందిన డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య (84)కు ఆరేడు సంవత్సరాల క్రితం తన చిన్ననాటి కలైన లైబ్రరీని ప్రారంభించారని ప్రధాని ప్రశంసించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఈ గ్రంథాలయంలో దాదాపు రెండు లక్షల పుస్తకాలున్నాయని, ఆయన కృషితో స్ఫూర్తి పొంది అనేక ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను రూపొందించే పనిలో నిమగమై ఉన్నారని మోదీ  చెప్పారు.