అణ్వాయుధాలను తిప్పి కొట్టగలిగే సామర్థ్యం

అణ్వాయుధాలను తిప్పికొట్టగలిగే సామర్థ్యం భారత్ కు అవసరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భారత దేశంపై కన్నెత్తి చూసే సాహసం చేయడానికి ఇతర దేశాలకు అవకాశం లేకుండా అత్యంత సమర్థవంతమైన బ్రహ్మోస్ క్షిపణులను భారత్ తయారు చేయాలని సూచించారు. 
 
డిఫెన్స్ టెక్నాలజీస్, టెస్ట్ సెంటర్, బ్రహ్మోస్ తయారీ కేంద్రానికి ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో  శంకుస్థాపన చేస్తూ బ్రహ్మోస్ క్షిపణులు, తదితర ఆయుధాలను భారత దేశం తయారు చేస్తోందని పేర్కొన్నారు.  అయితే ఇతర దేశాలపై దాడి చేయాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
శత్రుత్వ భావంతో ఏ దేశమైనా మనపై దాడి చేస్తే, దేశ ప్రజలను కాపాడుకోవడం కోసం వీటిని తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి  చెప్పారు. ఇతర దేశాలపై దాడి చేసే స్వభావం భారత దేశానికి లేదని పేర్కొన్నారు. ఇతర దేశాలకు చెందిన భూమిని కనీసం ఒక అంగుళం మేరకైనా కబ్జా చేసే నైజం భారత్‌కు లేదని స్పష్టం చేశారు.
 బ్రహ్మోస్‌ను భారత దేశ గడ్డపై తయారు చేయాలనుకుంటున్నది ఇతర దేశాల శత్రుత్వ దృష్టి మన దేశంపై పడకుండా చేయడానికేనని తెలిపారు.  పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ, కొంత కాలం క్రితం భారత దేశం నుంచి వేరుపడిన పొరుగు దేశం ఉద్దేశాలు ఎల్లప్పుడూ భారత దేశానికి వ్యతిరేకంగా ఎందుకు ఉంటాయో తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. 
 
పొరుగు దేశం మన దేశంలోని ఉరి, పుల్వామాలలో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఉగ్రవాద దాడుల అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ నిర్ణయం తీసుకున్నారని, వెంటనే ఆ దేశంలోకి వెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని గుర్తు చేశారు. 
 
వైమానిక దాడులు చేయవలసిన అవసరం వచ్చినపుడు విజయవంతంగా చేశామని చెప్పారు. ఎవరైనా మనపై కన్నెత్తి చూస్తే, మనం మన దేశంలోనే కాకుండా, సరిహద్దులను దాటుకుని వెళ్ళి మరీ తగిన బుద్ధి చెప్పగలమనే సందేశాన్ని పంపించామని పేర్కొన్నారు. ఇది భారత దేశ బలమని తెలిపారు.