యువతుల వివాహ వయస్సు పెంచడం ప్రగతిశీలం 

మహిళల వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనను “ప్రగతిశీల” చర్య అని అంటూ అందుకు ప్రధాని నరేంద్ర మోదీని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ప్రశంసించారు.  ఈ నిర్ణయం పట్ల మహిళల ప్రశంసలు తమ సాధికారత కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలనే పార్టీ సంకల్పాన్ని బలపరుస్తున్నాయని ఆయన చెప్పారు. 
 
 “ప్రధాని నరేంద్ర మోదీ  తీసుకున్న చాలా ప్రగతిశీల నిర్ణయం. మహిళలకు వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచడం, పురుషులతో సమానంగా వారిని తీసుకురావడం మహిళల సాధికారత దిశగా ఒక చారిత్రాత్మక అడుగు” అని డెహ్రడూన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ చెప్పారు. 
 
భారతదేశంలో మహిళలకు వివాహ వయస్సు చాలా తక్కువగా ఉండటంపై ఆరోగ్య సంస్థలు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించే నిర్ణయం ఇది అని ఆయన తెలిపారు. మహిళల వివాహ వయస్సు పెంపు బిల్లును శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టగా, దానిని పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు.

రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాలను సమీక్షించేందుకు వచ్చిన నడ్డా 41 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, విస్తారక్‌లతో మాట్లాడి బూత్‌లపై దృష్టి సారించాలని కోరారు. 
 
ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 84వ ఎపిసోడ్ రాజకీయ కంటెంట్ లేనిదని బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. తాజా ఎపిసోడ్‌లో ప్రధాని ఒక్క రాజకీయ అంశాన్ని కూడా లేవనెత్తలేదని.. మానవులకు సంబంధించిన సామాజిక, సమకాలీన అంశాల గురించి మాత్రమే మాట్లాడారని ఆయన పేర్కొన్నారు.