జగన్ ప్రభుత్వంపై బిజెపి పోరాట భేరి రేపే!

ఆంధ్ర ప్రదేశ్ లో  వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాట భేరిని విజయవాడలో మంగళవారం మోగించనున్నది. ఇటీవల తిరుపతి వచ్చిన కేంద్ర హోమ్ అమిత్ షా మార్గనిర్ధేశం మేరకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై  క్షేత్ర స్థాయిలో పోరాడేందుకు సంసిద్ధతలో భాగంగా ఇక్కడ `ప్రజాగ్రహ సభ’ నిర్వహిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ప్రజలను సమీకరించి బలమైన పోరాట సందేశం ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దేశానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న సేవ, కృషి వివరిస్తూ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న తీరు, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్న విధానంపై నేతలు గళం విప్పనున్నారు.
ఈ నెల 28న విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో జరిగే సభ ద్వారా ప్రజలకు పలు విషయాలు వివరించనున్నారు. ఏపీ బిజెపి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌ రాష్ట్రంలో పార్టీని పోరాటపథంలో నడిపేందుకు రూపొందించిన కార్యప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం జరుపుతున్నట్లు తెలుస్తున్నది.
కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను ఈ సభలో ముఖ్యఅతిధిగా పాల్గొననున్నారు. ప్రజాగ్రహ సభలో బీజేపీ నేతలు పలు అంశాలపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తున్నది.  కరోనా కట్టడి నుంచి రాష్ట్రానికి మోదీ ఏం చేశారు.. జగన్‌ ఎందుకు చేయలేకపోయారు? బెజవాడలో ఫ్లై ఓవర్లు కేంద్రం ఎంత వేగంగా నిర్మించింది.. రాష్ట్రంలో రోడ్లను జగన్‌ ఎంత అధ్వాన్నంగా ఉంచారు?
పంచాయతీలకు కేంద్రం నిధులిస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం ఎటు మళ్లించింది? ఇలా పలు అంశాలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇలా ఉండగా, బీజేపీ ప్రజాగ్రహ సభకు అమరావతి రైతులు, ఈ సేవ సిబ్బంది, రేషన్‌ డీలర్లు వస్తున్నట్లు సమాచారం అందడంతో కరోనా నిబంధనల పేరుతో అడ్డంకులు కల్పించేందుకు స్థానిక పోలీసులు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది.