విద్యార్థుల ఫీజుల పెంపు జిఓలను రద్దు చేసిన హైకోర్టు 

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విషయంలో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిఫారసు ఆధారంగా ఫీజులు నిర్ణయిస్తూ ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం ఆగస్టు 24న జారీ చేసిన 53, 54 జీవోలను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. విద్యాసంస్థలను భౌగోళికంగా విభజించి ఫీజులు నిర్ణయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. 

కమిషన్‌ నిబంధన 8ని అనుసరించి ఫీజు సిఫారసు విషయంలో వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ప్రతి ప్రైవేటు పాఠశాల, కళాశాల నుంచి వివరాలు ఆహ్వానించాలని స్పష్టం చేసింది. ఆయా వివరాల ఆధారంగా 2022 మార్చి 31లోగా కొత్త ఫీజులు సిఫారసు చేయాలని, వాటిని ప్రభుత్వం ఖరారు చేయాలని తెలిపింది.

 ప్రభుత్వం ఖరారు చేయబోయే ఫీజుల కంటే 2021-22లో అధికంగా ఫీజులు వసూలు చేసి ఉంటే ఆ సొమ్ము తిరిగి విద్యార్థులకు చెల్లించాలని, తక్కువ వసూలు చేసిఉంటే విద్యార్థుల నుంచి రాబట్టవచ్చని యాజమాన్యాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు సోమవారం కీలక తీర్పు ఇచ్చారు.

‘‘చట్టప్రకారం ఫీజులను సిఫారసు చేసే అధికారం మాత్రమే కమిషన్‌కు ఉంది. నిర్ధారించే అధికారం లేదు. ప్రస్తుత వ్యాజ్యాలలోని రుసుములను పరిశీలిస్తే భౌగోళిక ప్రాంతాల వారీగా ఫీజులు ఖరారు చేసినట్లు కనపడుతోంది. గ్రామపంచాయితీ పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన విద్యాసంస్థకు, అదే ప్రాంతంలో మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న విద్యాసంస్థకు ఒకే రకమైన ఫీజు నిర్ణయించడం సరికాదు” అని హైకోర్టు స్పష్టం చేసింది. 

“విద్యాసంస్థల నిర్వహణ అంత సులువు కాదు. మౌలిక వసతులు, ఆటస్థలం, మరుగుదొడ్ల, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకొని విద్యాసంస్థలను వర్గీకరించండి. ఆ తరువాతే ఫీజుల విషయంలో సిఫారసు చేయండి. ఫీజులు సిఫారసు చేసేముందు విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రుల గురించి ఆలోచించండి” అంటూ సూచించింది. 

ఏటా ఫీజుల వివాదం తెరమీదికి వస్తుండడంతో తల్లిదండ్రులు అయోమయంలో పడుతున్నారని పేర్కొంటూ  ఫీజుల విషయంలో శాశ్వత పరిష్కార మార్గం కనుగొమని కమిషన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. 

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న జారీ చేసిన జీవోలు 53, 54ని సవాల్‌ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, అలాగే జీవో 53ను సవాల్‌ చేస్తూ ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె. శ్రీకాంత్‌బాబు మరికొన్ని విద్యాసంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశాయి.