ఏపీలో బెయిల్ పై ఉన్న నేత‌లు జైలుకి వెళ్ళ‌డం ఖాయం

ఏపీలో చాలామంది నేతలు బెయిల్ పై బయట ఉన్నారని పేర్కొంటూ బెయిల్ పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం అని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. 
 
విజ‌య‌వాడ‌లో వైసిపి ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతూ రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన ప్ర‌జాగ్ర‌హ స‌భ‌లో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ వైసీపీ, టీడీపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌ని విమర్శించారు.  తాను కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పోల‌వ‌రానికి అన్ని అనుమ‌తులు వ‌చ్చాయ‌ని చెప్పారు.
అనుమ‌తులు ఇచ్చి ఏడు సంవ‌త్స‌రాలు అయినా పోల‌వ‌రం పూర్తి చేయ‌లేద‌ని ఆయన మండిప‌డ్డారు. అమ‌రావ‌తి కోసం అట‌వీభూముల‌ను బ‌దిలీ చేశామ‌ని పేర్కొంటూ తాను కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఏపీలో కొన్ని స‌మ‌స్య‌లు గుర్తించాన‌ని తెలిపారు. పుష్ప సినిమాలో మాదిరిగా ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందని పేర్కొంటూ విచారణకు ఏర్పాటు చేసిన సిట్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని జవదేకర్‌ దుయ్యబట్టారు. .
రాష్ట్రంలో మద్య నిషేధం అని చెప్పి, ఇప్పుడు మద్యంపై వచ్చే డబ్బుతోనే పరిపాలన సాగిస్తున్నారని జవదేకర్  విమర్శించారు. అయోధ్యలో గొప్పగా రామాలయం నిర్మిస్తున్నామని, వారణాసి, చార్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాల రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. 
 
అయితే ఏపీలో పరిస్థితి బాగా లేదని, అంతర్వేదిలో రథం దగ్ధమైందని, రామతీర్థంలో స్వామివారి విగ్రహాన్ని విరగ్గొట్టారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్… ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలది అవినీతి పాలనే అని ఆరోపించారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొందని చెప్పారు. 

తొందరలోనే ఆర్థిక ఎమర్జెన్సీ 

ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మాజీ కేంద్ర మంత్రి,  ఎంపీ సుజనాచౌదరి విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే సమయం దగ్గర్లో ఉందని స్పష్టం చేశారు. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజలను సీఎం జగన్‌రెడ్డి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
ఇసుక, మద్యం, మైనింగ్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. మద్య నిషేధం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుడి చేత్తో పథకాలకు ఇచ్చి ఎడమ చేత్తో లాక్కుంటున్నారని విమర్శించారు. అలాగే ఓటీఎస్‌ పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.
 
 రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా కేసుల మాఫీ కోసమే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ఏపీలో ఏం జరుగుతోందని కేంద్ర హోంశాఖ నిత్యం నిఘా వేస్తోందని అంతకు ముందు వెల్లడించారు. అధికార పార్టీ తప్పిదాలకు సహకరించే పారిశ్రామిక వేత్తలపైనా కేంద్రం కన్నేసిందని తెలిపారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారులపైనా నిఘా పెట్టిందని పేర్కొన్నారు. 
 
రెండున్నరేళ్లుగా జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు చూశామంని ఎంపీ సీఎం రమేష్‌ చెప్పారు. పాలనలో కొన్ని వందల అక్రమాలు, అన్యాయాలు చేశారని ఆయన ఆరోపించారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొంత సమయం ఇద్దామనుకున్నామన్నారు. ప్రజలకు ఒక్కటైనా మేలు చేసే కార్యక్రమం చేయలేదని ఆయన డ్వాకా,ఎత్తారు. 
 
ఏపీ సంపద ఎక్కడికి పోయింది?, ఇసుక లీజులు ఎవరికి ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. బెదిరించి మైనింగ్‌ గనులను వశపర్చుకున్నారని ఆరోపించారు. కావాల్సిన లిక్కర్‌ బ్రాండ్లను కావాల్సిన వారితో అమ్ముతున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ 6 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష్య పూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.