2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతల పేర్లు చెప్పమని తనను బెదిరించారని ఓ సాక్షి న్యాయస్థానం ముందు వెల్లడించిన తర్వాత `కాషాయ ఉగ్రవాదం’ పేరుతో ఓ తప్పుడు కేసులో తమ నేతలను ఇరికించేందుకు యూపీఏ హయాంలో కాంగ్రెస్ నీచమైన రాజకీయ కుట్ర పన్నిందని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రేష్ కుమార్ ఆరోపించారు.
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల వ్యక్తిత్వాన్ని హత్య చేసినందుకు కాంగ్రెస్ నేతలు-మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ హోంమంత్రి పి చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, దిగ్విజయ్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్‌లు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
2008 మాలెగావ్ పేలుడు కేసులో ఎదురు తిరిగిన ఒక సాక్షి ప్రస్తుతం యుపి ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్, ఇంద్రేశ్ కుమార్ లతో సహా మరో నలుగురు నేతల పేర్లను చెప్పమని అప్పటి సీనియర్ ఎటిఎస్ అధికారి పరమ్ బీర్ సింగ్, మరొక అధికారి తనను బెదిరించారని ముంబైలోని కోర్టులో వెల్లడించడంపై స్పందిస్తూ ఇంద్రేష్ కుమార్ చేశారు.
దోపిడీ, ఇతర కేసులు ఎదుర్కొంటున్న పరమ్ బీర్ సింగ్‌ను ఈ మధ్యనే సస్పెండ్ చేశారు. ఆ సమయంలో `కాషాయ ఉగ్రవాదం’కు సంబంధించిన కేసులన్నీ కాంగ్రెస్ తన నీచపు రాజకీయాలలో భాగంగా పన్నిన కుట్ర అని ఇది ఇప్పుడు ఋజువైన్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ నేత స్పష్టం చేశారు.
ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న” ఇతర రాజకీయ పార్టీలను, వాటి నాయకులను కూడా ఆయన ఈ సందర్భంగా నిందించారు. వారు కాంగ్రెస్, దాని సంకీర్ణ ప్రభుత్వ “మురికి రాజకీయాలు, అబద్ధపు కుట్ర” పక్షాన నిలబడి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలను కాషాయ ఉగ్రవాద కేసుల్లో ఇరికించడం ద్వారా “పెద్ద పాపం, నేరం” కూడా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎటిఎస్ తనను చిత్రహింసలకు గురిచేసినదని, చట్టవిరుద్ధంగా తన కార్యాలయంలో నిర్బంధించిందని కూడా ఆ సాక్షి ఈ సందర్భంగా కోర్టులో చెప్పారు. ఆ తర్వాత అతను ఎటిఎస్ ముందు చేసిన ప్రకటనను పరిగణలోకి తీసుకోవడం లేదని కోర్ట్ పరిగణించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 220 మంది సాక్షులను విచారించగా వారిలో 15 మంది వ్యతిరేకంగా మారారు.
అప్పటి యుపిఎ హయాంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను కాషాయ ఉగ్రవాద కేసుల్లో ఇరికించేందుకు తన శక్తి, యుక్తులను ప్రయోగించింది. కానీ వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేనందున “ఏ ఎఫ్‌ఐఆర్‌లలో మా పేర్లను” నమోదు చేయలేకపోయారని ఇంద్రేశ్ కుమార్ పేర్కొన్నారు.
“కాషాయ ఉగ్రవాదం కధనం సృష్టించడంలో” పాలుపంచుకున్న లేదా “అలాంటి అమానవీయ రాజకీయాలకు” మద్దతు ఇచ్చిన పార్టీలు, నాయకులందరికీ “ప్రజాస్వామ్యయుతం” గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు 29, 2008న, ముంబైకి 200 కి.మీ దూరంలో ఉన్న నాసిక్‌లోని మాలెగావ్ పట్టణంలోని ఒక మసీదు సమీపంలో మోటారు సైకిల్‌పై పేలుడు పదార్థం పేలడంతో ఆరుగురు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో లోక్‌సభ సభ్యురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, షుదాకర్ దివేది, మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ (రిటైర్డ్), అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలు బెయిల్‌పై బయట ఉన్నారు.
More Stories
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
సంచలన ఆరోపణలు చేసే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి