లూథియానా పేలుళ్ల కేసులో జర్మన్ ఉగ్రవాది అరెస్ట్

పంజాబ్‌లోని లూథియానా కోర్టు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న జర్మనీకి చెందిన ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీని అరెస్టు చేశారు. సెట్రల్ జర్మనీలోని ఎర్పార్ నుంచి ఫెడరల్ పోలీసులు ముల్తానీని అదుపులోకి తీసుకున్నారు. లూథియానా బాంబు పేలుళ్ల ప్రాథమిక విచారణలో ముల్తానీ పేరు బయటపడింది. 
 
భారతదేశం నుండి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు వెనుక సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్ ఎస్ జె) అనే సంస్థకు చెందిన జస్విందర్ సింగ్ ముల్తానీని జర్మనీ అధికారులు అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు.

అతనిని జర్మనీలోని ఒక నగరంలో అదుపులోకి తీసుకున్నట్లు బెర్లిన్‌లోని అధికారులతో ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు పంచుకున్న తర్వాత భారతదేశంలో ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేయడంలో అతని పాత్ర ఉందని ఆరోపించినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన ముల్తానీని అక్కడ  నిర్బంధంలో ఉంచారు. 

 
బెర్లిన్‌లోని అధికారులకు దౌత్య మార్గాల ద్వారా భారత ఏజెన్సీలు అందించిన ఇన్‌పుట్‌లపై విచారిస్తున్నారు. డిసెంబరు 23న లూథియానా కోర్టు కాంప్లెక్స్ వద్ద బాంబు పేలుడు సంభవించి ఐదు రోజుల తర్వాత ముల్తానీ నిర్బంధం జరిగింది.  ఈ పేలుడులో  బాంబును అమర్చినట్లు భావిస్తున్న ఉద్యోగం నుండి తొలగించిన  పోలీసు గంగాదీప్‌ చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

ఖలిస్థాన్ నాయకులు అని పిలవబడే కొందరు పాకిస్తాన్ సరిహద్దుల నుండి పంజాబ్ లో సాగిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలపై ఈ సందర్భంగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని శివార్లలో రైతుల ఆందోళనలో ప్రముఖ రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్‌ను చంపే ప్రణాళికకు సంబంధించి ముల్తానీ పేరు ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా వచ్చింది.

రైతు నాయకులు రాజేవాల్, బల్దేవ్ సింగ్ సిర్సా, కుల్దీప్ సంధు,  జగ్జీత్ సింగ్‌లను హతమార్చేందుకు పథకం పన్నారనే ఆరోపణలపై హర్యానా పోలీసులు ఈ ఏడాది జనవరిలో సోనిపట్‌లో యోగేష్ అనే యువకుడిని అరెస్టు చేశారు. అతని మొబైల్‌లో ఉన్న వ్యక్తుల చిత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన యువకుడు సందేశాల ద్వారా ముల్తానీతో టచ్‌లో ఉన్నాడని, కొంతమంది రైతు నాయకులను లక్ష్యంగా చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, లూథియానా బాంబు పేలుడు విచారణ సందర్భంగా, బాంబర్ పాకిస్తాన్, గల్ఫ్ దేశాలలోని ఖలిస్తాన్ అనుకూల నాయకులతో టచ్‌లో ఉన్నాడని నిర్ధారించే ముఖ్యమైన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సేకరించిన సాక్ష్యాల ప్రకారం, ముల్తానీతో గంగాన్‌దీప్ నిరంతరం టచ్‌లో ఉన్నాడని, పేలుడు కోసం పేలుడు పదార్థాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడని నిఘా వర్గాలు గుర్తించాయి.  సోషల్ మీడియా మెసెంజర్‌లోని చాట్‌లు పంజాబ్,  దేశంలోని ఇతర ప్రాంతాల్లో మరిన్ని పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నాయని సూచించినట్లు వారు తెలిపారు.

పాక్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్ స్టార్ హర్విందర్ సింగ్ ద్వారా లూథియానా బాంబ్ పేలుళ్లకు ప్లాన్ చేసిన్నట్లు భావిస్తున్నారు. ముల్తానీని విచారించేందుకు భారత్ దర్యాప్తు సంస్థలు త్వరలో జర్మనీకి వెళ్లే అవకాశముంది. పైగా, అంతేకాదు.. దేశంలోని ఢిల్లీ, ముంబాయిలోనూ ముల్తానీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. 

ఖలిస్తాన్ అనుకూలుడే కాకుండా ముల్తానీ పంజాబ్ సరిహద్దు నుంచి పాకిస్తాన్ ద్వారా భారత దేశానికి ఆయుధాలు, మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్‌లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లూథియానా కోర్టులో పేలుడు ఘటన సంచలనం రేపింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ పేలుడు జరిగినట్లు భావిస్తున్నారు. ముల్తానీ పంజాబ్‌‌కు చెందిన వ్యక్తి.