శ్రీ సత్యసాయి జిల్లాలో జాతీయ రహదారుల నిర్వహణకు సంబంధించిన రూ. 10.69 కోట్ల టెండర్లలో భారీ అవినీతి, టెండర్ రిగ్గింగ్, రోడ్డు అంచనాల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయన ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు, ఆ శాఖ కార్యదర్శి వి. ఉమాశంక్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
కేంద్ర రోడ్డు రవాణా శాఖ జారీ చేసిన ‘షార్ట్ టర్మ్ మెయింటెనెన్స్’ టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ టెండర్ ద్వారా ఎన్ హెచ్ -42, ఎన్ హెచ్340 పరిధిలోని సత్యసాయి జిల్లా ప్రాంతాల్లో పలు రహదారులు, ఆర్‌ఓబీ నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న నిర్మాణ సంస్థలు పరస్పరం కుమ్మక్కయ్యాయని, అధికారుల సహకారంతో టెండర్ విలువను కృత్రిమంగా పెంచేందుకు కల్పిత బిడ్లు దాఖలు చేశాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.
కొంతమంది బిడ్డర్లను కావాలనే సాంకేతిక కారణాలతో అనర్హులుగా ప్రకటించి, చివరకు తాము అనుకున్న సంస్థలకే టెండర్ దక్కేలా కుట్ర పన్నారని పేర్కొన్నారు.
త్వరలోనే ఈ టెండర్ల బిడ్డింగ్ ఓపెన్ చేయాల్సి ఉందని, ఈ వ్యవహారంలో సంబంధిత సూపరింటెండింగ్ ఇంజనీర్ కూడా కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. ప్రజాధనాన్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, ఆ శాఖ కార్యదర్శిని కోరారు.
సమగ్ర విచారణ పూర్తయ్యేంత వరకు ఈ టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రహదారి పనుల అంచనాలు, పోటీలో పాల్గొన్న కాంట్రాక్టర్ల అర్హతలు, ఇతర సాంకేతిక అంశాలను కేంద్ర విజిలెన్స్ కమిషన్ పరిశీలించి, నివేదిక ఇచ్చిన తర్వాతే టెండర్లను ఖరారు చేయాలని అధికారులను కోరారు.

More Stories
తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి కలిసే ముందుకు
ఇకపై భరించే ఓపిక లేదు.. ఏపీ అభివృద్ధి కోసమే అమిత్‌షాను కలిశా!
పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా