రోగ లక్షణాలు కనిపించని ఒమిక్రాన్‌ బాధితులు

ప్రపంచ దేశాల్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్‌ మమన దేశంలోనూ గణనీయంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో 415 కేసులు నమోదు కాగా .. బాధితుల్లో 115 మంది కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. 

మనదేశంలో ఒమిక్రాన్‌ భారినపడిన వారిలో అధికశాతం మందిలో ఎలాంటి లక్షణాలూ కనబడకపోవడం, ఒకవేళ కొందరిలో కనిపించినా ఈ వేరియంట్‌ ప్రభావం స్వల్పంగానే ఉన్నట్లు ఢిల్లీకి చెందిన పలువురు వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు.

ఒమిక్రాన్‌ సోకినప్పటికీ త్వరగా కోలుకుని డిశ్చారి అవుతున్నారని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ సురేష్‌ పేర్కొంటున్నారు. తీవ్రమైన లక్షణాలు ఎవరిలోనూ కనబడటం లేదని తెలిపారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో దాదాపు 90 శాతం కేసుల్లో మాత్రం ఎలాంటి లక్షణాలు లేకపోవడం, వాళ్లకు చికిత్సలు కూడా అందిచాల్సిన అవసరం లేకపోవడం ఊరటిచ్చే అంశమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దక్షిణాఫ్రికాలో తొలిసారి ఒమిక్రాన్‌ గుర్తించిన వైద్యురాలు డాక్టర్‌ అంజెలిక్‌ కూట్టీ కూడా ఇటీవల ఈ వేరియంట్‌ ప్రభావానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. తమ దేశంలో ఒమిక్రాన్‌ సోకిన వారంతా సాధారణ చికిత్సతోనే కొలుకుంటున్నారని ఆమె వెల్లడించారు. 

ఒమిక్రాన్‌ ఇన్ఫ్‌క్షన్‌ను గుర్తించాక ఓ మోస్తరు స్థాయిలో కొన్ని ఔషదాలను ఇవ్వడం ద్వారా కండరాల నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం పొందొచ్చని సూచించారు. ఆక్సిజన్‌ , యాంటీబయోటిక్స్‌ వినియోగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.