రెండు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్ లోని షొపియాన్ , పుల్వామా జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షొపియాన్ జిల్లాలో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు లష్కర్ ఒ తొయిబాకు చెందిన వారుగా గుర్తించగా, పుల్వామా జిల్లాలో హతమైన ఇద్దరు మృతులు గుర్తు తెలియని ఉగ్రవాదులుగా చెబుతున్నారు. 
 
ఉగ్రవాదుల ఉనికి సమాచారం తెలియగానే భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. షొపియాన్ ప్రాంతం చౌగాం గ్రామంలో శనివారం భద్రతా బలగాలకు , ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
మృతులు లష్కర్ ఇ తొయిబా గ్రూపుకు చెందిన సాజద్ అహ్మద్ చాక్ , రాజా బాసిత్ యాకూబ్‌గా గుర్తించారు. సాజద్ షోపియాన్ లోని బ్రారిపోరా ప్రాంతానికి చెందగా, రాజా బాసిత్ పుల్వామా లోని అచాన్ లిట్టర్ ప్రాంతానికి చెందిన వారుగా తెలుసుకున్నారు.
వీరిరువురికీ అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని, వీరిలో చాక్ యువకులను ఉగ్రవాద సంస్థలో చేర్చడం పనిగా పెట్టుకున్నాడని పోలీస్ అధికారులు తెలిపారు. లొంగిపోడానికి అవకాశం ఇచ్చినా వారు వినకుండా ఎదురు కాల్పులు జరిపారని పేర్కొన్నారు.