కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు నిందితుడు ఖలిస్థానీ

పంజాబ్‌లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన బాంబు పేలుడు ఘటన నిందితునికి ఖలిస్థాన్, గ్యాంగ్‌స్టర్లు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నట్టు పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ తెలిపారు. 

మనం ఉగ్రవాదం, డ్రగ్స్ నుంచి సవాళ్లు ఎదుర్కొంటున్నామని, మాదక ద్రవ్యాల వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం ప్రమాదకరమైన కాక్‌టెయిల్ వంటివని, లుథియానా కేసు కూడా అలాంటిదేనని ఆయన పేర్కొన్నారు.

ఘటనా స్థలం నుంచి చిరిగిన దుస్తులు, సిమ్‌కార్డు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు చెప్పారు. తమ ప్రాథమిక అంచనా సరైనదేనని తేలిందని పేర్కొన్నారు. 24 గంటల్లోనే ప్రధాన నిందితుడిని గుర్తించామని, అతడు 2017లో అరెస్ట్ అయ్యాడని వివరించారు.

ఈ నెల 23న లుథియానాలోని జిల్లా, సెషన్స్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన వెనక పాక్ ప్రేరేపిత ఖలిస్థాన్ అనుకూల సంస్థ బబ్బర్ ఖల్సా హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. 

కోర్టు కాంప్లెక్స్‌లో బాంబు అమర్చి, పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని మాజీ కానిస్టేబుల్ గగన్‌దీప్‌గా గుర్తించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన గగన్‌దీప్‌ను ఆ తర్వాత విధుల నుంచి తొలగించారు. ఈ కేసులో ఆగస్టు 2019లో అరెస్ట్ అయ్యాడు, రెండేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు.

ఈ ఏడాది సెప్టెంబరులో బెయిలుపై జైలు నుంచి అతడు విడుదలైనట్టు అధికారులు తెలిపారు. బాంబును అసెంబుల్ చేయడం, యాక్టివేట్ చేయడంపై అతడి వద్ద ఉన్న డాంగిల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎవరి నుంచే సమాచారం తీసుకున్నట్టు ఎన్ఐఏ, పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు.