ఎఎఫ్‌ఎస్‌పిఎ రద్దుకు కేంద్రం కమిటీ!

నాగాలాండ్‌లో వివాదాస్పద సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) రద్దు చేయాలనే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేఫియు రియో ఆదివారం ట్వీట్‌ చేశారు. ఈ నెల 23న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో తనతోపాటు అస్సాం ముఖ్యమంత్రి హేమంత విశ్వ శర్మ, నాగాలాండ్‌ ఉప ముఖ్యమంత్రి వై పట్టాన్‌, ఎన్‌పిఎఫ్‌ఎల్‌పి నేత టిఆర్‌ జెలియాంగ్‌ పాల్గన్నట్లు నేఫియు రియో పేర్కొన్నారు. ప్రజలు సంయమనంతో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని కోరారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి (ఈశాన్య వ్యవహారాలు) అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ కమిటీలో నాగాలాండ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డిజిపిలు ఉంటారని, వీరితో పాటు ఐజిఎఆర్‌ (ఎన్‌), సిఆర్‌పిఎఫ్‌ ప్రతినిధులు ఇతర సభ్యులుగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.
45 రోజుల్లోగా కమిటీ నివేదిక అందజేస్తుందని, కమిటీ ప్రతిపాదనల ఆధారంగా ఆఫ్సా రద్దు అంశంపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అలాగే కాల్పుల ఘటనతో ప్రమేయమున్న సైనికాధికారులపై కోర్టు ద్వారా నిష్పాక్షిక విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని తక్షణమే సస్పెన్షన్‌లో ఉంచాలని కూడా నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో పాటు కాల్పుల్లో మరణించిన పౌరుల కుటుంబాల్లో పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కూడా నిర్ణయించినట్లు చెప్పారు.
సైనిక అధికారుల కాల్పుల్లో ఇటీవల 14 మంది సాధారణ పౌరులు చనిపోయిన దారుణ ఘటన తర్వాత ఆఫ్సాను రద్దు చేయాలనే డిమాండ్‌ నాగాలాండ్‌లో తీవ్రమైంది. ఈశాన్య రాష్ట్రమంతటా ప్రజాందోళనలు మిన్నంటాయి. నాగాలాండ్‌ అసెంబ్లీ సైతం ఆఫ్సా ఉపసంహరించుకోవాలని గత వారం ఏకగ్రీవ తీర్మానం చేసింది.