మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎంపీ రంజిత్ రెడ్డిలకు కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారం రోజుల పాటు రైతుల సమస్యలపై ఢిల్లీలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తేలింది. దీంతో మంత్రి ఎర్రబెల్లి ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలెవ్వరూ తన వద్దకు రావద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. తన నియోజకవర్గ ప్రజలకు అధికారులు, పీఏలు అందుబాటులో ఉంటారని సూచించారు. కాగా, ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి వైద్యులను సంప్రదించి వైద్యం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంపీల బృందంతో పాటు ఆయన కూడా ఉన్నారు.  ‘టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు అధికారులకు ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే… కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.’ అంటూ రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

కాగా ఢిల్లీ పర్యటనకు మంత్రి ఎర్రబెల్లితో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సహా టిఆర్‌ఎస్ పార్లమెంట్ నేత కెకె, ఎపి నామా నాగేశ్వరరావుతో పాటు కొందరు కూడా ఉన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 3 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది.

గత 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 333 మంది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. వారందరికీ కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా ఎనిమిది మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. 

ఇప్పటి వరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి 11,245 మంది ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్టీసీఆర్ పరీక్షలు చేశారు. వీరిలో 83 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారందరి నమూనాలను అధికారులు జీనోమ్ సీక్వీన్సింగ్ కి పంపించారు.

వారిలో 22 మందికి ఇప్పటికే ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చింది. మిగిలిన 61 మందికి పాజిటివ్ గా తేలింది. చికిత్స అనంతరం బాధితుల్లో 10 మంది కోలుకున్నారు. మరో 20 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

తెలంగాణ అంతటా ఆంక్షలు 

ఇలా  ఉండగా,  ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణ చట్టం కింద ఆంక్షలు అమలు చేయనుంది.

జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించారు. కొన్ని నియంత్రణ చర్యలతో జనసమూహం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఆయా కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. 

వేదికల ప్రవేశద్వారాల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించే విషయమై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తారు.