జనవరి 3 నుంచి పిల్లలకు టీకాలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసువారికి కొవిడ్ టీకాలు ప్రారంభిచనున్నట్లు వెల్లడించారు. జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ ప్రారంభిస్తామని కూడా తెలిపారు. 

శనివారం రాత్రి జాతినుద్దేశిస్తూ ప్రధాని మోదీ ప్రసంగిస్తూ  60 ఏళ్లు పైబడిన వారికి వైద్య నిపుణుల సలహామేరకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నామని చెప్పారు. తొలిసారి నాసల్, డిఎన్‌ఏ ఆధారిత టీకా అందజేయబోతున్నామని పేర్కొన్నారు. అ నూతన సంవత్సర వేడుకలను ఆరోగ్యకరంగా జరుపుకోవాలని ప్రధాని సూచించారు. 

వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని, శుభ్రత పాటించాలని ఆయన సూచించారు. అయితే, ఆందోళన అవసరంలేదని ప్రధాని భరోసా ఇచ్చారు. ఇన్‌ఫెక్షన్లు పెరిగితే తగిన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ వాటి గురించి వివరించారు.

దేశంలో ఇప్పుడు 18 లక్షల ఐసోలేషన్ పడకలు, ఐదు లక్షల ఆక్సిజన్ బెడ్లు, 1.4 లక్షల ఐసియు పడకలు, 90,000 ప్రత్యేక పడకలు చిన్నారులకు అందుబాటులో ఉన్నాయని ప్రధాని తెలిపారు. 3000 ఆక్సిజన్‌ప్లాంట్లు, నాలుగు లక్షల ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్రాలకు పంపినట్టు ప్రధాని తెలిపారు. 

దేశంలో ఔషధాలకు కొరత లేదని ప్రధాని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని 61శాతం వయోజనులకు రెండు డోసులు, 90 శాతానికి ఒక డోస్ టీకాలు అందాయని ప్రధాని తెలిపారు. ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని మోడీ పేర్కొన్నారు.

ఒమిక్రాన్ వల్ల ప్రపంచ దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అయితే భయపడాల్సిన పనిలేదని ప్రధాని స్పష్టం చేశారు. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని, ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. 

అయితే ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. దేశంలో ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే 100 శాతం టీకా కార్యక్రమం విజయవంతం అయ్యిందని ప్రధాని చెప్పారు. 11మాసాలుగా టీకా ఉద్యమం కొనసాగుతోందని చెబుతూ  భవిష్యత్‌లో కూడా అంతా సహకరించాలని ప్రధాని కోరారు.

 అంతకు ముందు, 12 నుండి 18 ఏళ్ల చిన్నారులకు అందించేందుకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిసిజిఐ) అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.  2-18 ఏళ్ల వయస్సు చిన్నారులపై కోవాగ్జిన్‌ (బిబివి152) క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన డేటాను సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సిడిఎస్‌సిఒ)కు భారత్‌ బయోటెక్‌ అందించింది. 

భారత్‌ బయోటెక్‌ ఇయుఎ దరఖాస్తును పరిశీలించిన సిడిఎస్‌సిఒ నిపుణుల కమిటీ.. 12-18 ఏళ్ల వయస్సుల వారికి కొన్ని షరతులతో కోవాగ్జిన్‌ను అత్యవసర వినియోగానికి ఆమోదించవచ్చునని సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు, అదను భద్రతా డేటా ఆధారంగా.. ఈ వ్యాక్సిన్‌ను వినియోగించేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ.. అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగానికి ఆమోదిస్తున్నట్లు డిసిజిఐ భారత్‌ బయోటెక్‌కు లేఖ రాసింది.