జగన్ కు కేసీఆర్ షాక్ … సినిమా టికెట్ ధరల పెంపు

సినిమా టికెట్ ధరలు గణనీయంగా తగ్గించడమే కాకుండా, ప్రభుత్వ చర్యను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారని థియేటర్లపై అధికారులు దాడులు చేస్తూ, ఏవో వంకలతో సీజ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వేధిస్తుండగా, తెలంగాణాలో మాత్రం టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా పరిశ్రమకు చెందిన వారు ఒక్కరే కావడంతో తోటి ముఖ్యమంత్రి వై  ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కె చంద్రశేఖరరావు ఒక విధంగా షాక్ ఇచ్చిన్నట్లు అయింది. రేట్ల పెంపుపై సర్కార్‌కు అధికారుల కమిటీ సిఫారసుల ప్రతిపాదనల మేరకు రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్‌ అనుమతి ఇచ్చింది.

ఏసీ థియేటర్లలో కనిష్టం రూ. 50.. గరిష్టం రూ. 150. మల్టీప్లెక్స్‌ల్లో కనిష్టం రూ.100.. గరిష్టం రూ. 250 మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్‌ సీట్లకు గరిష్టంగా రూ.300. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆయా టికెట్ల ధరలపై జీఎస్టీ నిసైతం వసూలు చేసుకునే అవకాశం కూడా కల్పించింది.

దీంతో ధియేటర్ల యజమానులతో పాటు డిస్టిబ్యూటర్లకు సైతం ఇదో భారీ ఊరటగా మారనుంది. ఇప్పటివరకూ జీఎస్టీ వసూలు చేసుకునే అవకాశం లేకపోవడంతో టికెట్ ధరలోనే జీఎస్టీని కలిపి థియేటర్లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఊరట కలగబోతోంది.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జిఒ నెంబర్‌ 35 ప్రకారం పంచాయతీల్లో నాన్‌ ఎసి థియేటర్లలో తరగతుల వారీగా రూ.5, రూ.10, రూ.15, చొప్పున ఎసి థియేటర్లలో తరగతుల వారీగా రూ.10, రూ.15, రూ.20 చొప్పున టికెట్లను విక్రయించాల్సి ఉంది.

ఓవైపు పొరుగున ఉన్న ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెంచకుండా థియేటర్లపై వైసీపీ సర్కార్ దాడులు చేస్తున్న వేళ.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం థరలు పెంచుతూ అనుమతి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది కొంతకాలంగా టాలీవుడ్ నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.