300 దాటిన ఒమిక్రాన్‌ కేసులు …. ప్రధాని సమీక్ష

కరోనా నూతన వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య దేశంలో 300 దాటింది. గురువారం ఒక్క రోజే తమిళనాడులో 33, మహారాష్ట్రలో 23, కర్ణాటకలో 12, కేరళలో ఐదు కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో విదేశీ ప్రయాణికులు, వారి కాంటాక్టుల్లో 33 కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో ఈ రాష్ట్రంలో గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 34కు చేరుకుంది. మహారాష్ట్రలో కొత్తగా 23 కేసులు నమోదు కావడంతో ఈ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 88కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా బుధవారం 12 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేశారు. 
 
మహారాష్ట్ర, కేరళలోనే కొత్తగా నాలుగు వేల మందికి పైగా కరోనా సోకింది. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపధ్యంలో గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ  ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
దేశంలో ఒమిక్రాన్‌, కరోనా పరిస్థితులపై ప్రధాని చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పలువురు నిపుణులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వ్యాక్సినేషన్‌పైనా ప్రధాని చర్చలు జరిపినట్లు సమాచారం.
 
ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కరోనా  కాలంలో అనుసరించాల్సిన విధానాలు (కోవిడ్‌ అప్రాప్రియేట్‌ బిహేవియర్‌– సీఏబీ) తప్పక పాటించాలని ప్రధాని ఈ సందర్భంగా  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు.వ్యాక్సినేషన్‌ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు.
 
ఈ సమయంలో అందరం అప్రమత్తంగా, జాగరుకతతో ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ, ఆరోగ్య వసతుల కల్పన, ఔషధాలు, ఆక్సిజన్‌ లభ్యత, వెంటిలేటర్లు, ఆస్పత్రి బెడ్స్‌ లభ్యత, మానవ వనరులు, టీకా కార్యక్రమ పురోగతి తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) తెలిపింది.
 
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి మర్నాడు తెల్లవారు జాము 5 గంటల వరకు కర్ఫూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  ప్రకటించారు. 
 
రాష్ట్రంలో ఒక్క  ఒమిక్రాన్‌ కేసు లేకపోయినా,  హారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్‌కు వచ్చేవారు ఎక్కువగా ఉండడం, కేసులు పెరుగుతుండడంతో ఈమేరకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 16 రాష్ట్రాలకు విస్తరించిన ఒమిక్రాన్ మధ్యప్రదేశ్‌లో కూడా విస్తరించే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

దేశంలో ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం  సూచించింది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.