ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు అందరూ పాస్!

ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు విద్యార్థులందరికి కనీసం 35 మార్కులు ఇచ్చి అందరినీ పాస్ చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మంచి మార్కులు సాధించాలని ఆమె సూచించారు. 

విద్యార్థులెవరూ తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దని ఆమె కోరారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు దగ్గర్లోనే ఉన్నందును..విద్యార్థులెవరూ ఒత్తిడికి గురికావొద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. అయితే ఇప్పటిలాగానే ఆందోళనలు చేస్తే ఇంటర్ సెకండియర్‌లో కూడా పాస్ చేస్తారని ఆశించవద్దని మంత్రి స్పష్టం చేశారు.

ఇంటర్ ఫస్టియర్ లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో  ఏడెనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.  దానితో కొన్ని రోజులుగా అందర్నీ పాస్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. విద్యార్థుల చావులకు సర్కారే కారణమంటూ ఇంటర్ బోర్డును ముట్టడించారు. సర్కారు తీరుపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి.

ఫస్టియర్ లో అందర్నీ పాస్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ‘కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాం. దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాం. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమన్వయం చేశాం’ అని మంత్రి  వివరించారు.

9, 10 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశామని ఆమె గుర్తు చేశారు. విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య చాలా కీలకం అని చెబుతూ  620 గురుకులాలను, 172 కస్తూర్బా కళాశాలలకు ఇంటర్‌కు అప్‌గ్రేడ్ చేశామని పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని, టీ-శాట్, దూరదర్శన్ వెబ్‌సైట్‌ల ద్వారా పాఠాలు అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు.

నెల రోజుల సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహించామని, 4.50లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని,  ఇంటర్ ఫస్టియర్‌లో 49 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి చెప్పారు. ఫస్టియర్ ఫలితాలపై వచ్చిన విమర్శలు సరికాదని ఆమె స్పష్టం చేశారు. 10వేల మంది విద్యార్థులు 95 శాతం మార్కులు సాధించారని ఆమె చెప్పారు.

ఇంటర్ బోర్డు తప్పు లేకున్నా నిందిస్తున్నారని అంటూ ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు బాధాకరం అని ఆమె విచారం వ్యక్తం చేశారు. పార్టీలను పక్కనపెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆమె హితవు చెప్పారు. ప్రతి విషయం రాజకీయ కోణంలో చూడొద్దని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి కోరారు.