లూధియానా కోర్టులో భారీ పేలుడు … ఒకరు మృతి 

పంజాబ్‌లోని లూధియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు  మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్‌ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న బాత్‌రూమ్‌లో మధ్యాహ్నం 12:22 గంటలకు జరిగిన ఈ పేలుడుతో బాత్‌రూమ్‌ గోడలు పూర్తిగా దెబ్బతినగా, సమీప గదుల్లో అద్దాలు దెబ్బతిన్నాయి.
 
ఈ ప్రేలుడు వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ప్రమాదం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుండి పేలుడుకు సంబంధించి సమగ్ర నివేదికను కోరింది.  భవనంలో ఒక సెక్షన్‌ బిల్డింగ్‌ రెండుగా చీలిపోయింది.
పేలుడు సమయంలో జిల్లా కోర్టు పూర్తి రద్దీగా ఉంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భవనంలోని ప్రజల్ని బయటకు తీసుకురావడంతో పాటు, క్షతగ్రాతుల్ని ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిలో ఇద్దరు మహిళలున్నారు.
 
లూధియానా పోలీస్‌ చీఫ్‌ గురుప్రీత్‌సింగ్‌ బుల్లార్‌ మాట్లాడుతూ ఎవరైనా ఈ పేలుడు పదార్థాలు ఇక్కడ అమర్చివుండవచ్చునని, లేదా సమీప ప్రాంతంలో ఉండొచ్చునని తెలిపారు. ఢిల్లీ నుంచి ఎన్‌ఎస్‌జి టీమ్‌ రాక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. 
 
గాయపడిన వారిలో నలుగురి ప్రాణాలకు ప్రమాదం లేదని తెలిపారు. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయానికి సమీపంలోనే కోర్టు భవనంలోనే పేలుడు జరగడం సంచలనంగా మారింది.
 
పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీ ఈ పేలుడును తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీయడానికే ఈ దాడి జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎవరూ ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.