డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువే 

డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌తో వ్యాధి తీవ్ర‌, ఆస్ప‌త్రిపాలయ్యే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని తాజాగా మ‌రో రెండు అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. 

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందినా ఈ వేరియంట్‌తో తీవ్ర అస్వ‌స్ధ‌త‌కు గుర‌వ‌డం, ఆస్ప‌త్రిపాల‌య్యే ముప్పు మూడింట రెండు వంతులు త‌క్కువ‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ ఎడిన్‌బ‌ర్గ్ ప‌రిశోధ‌కులు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసిన వ‌ర్కింగ్ పేప‌ర్‌లో పేర్కొన్నారు.

స్కాట్లాండ్‌లో ఈ అధ్య‌య‌నాన్ని ప‌రిశోధ‌కులు నిర్వ‌హించారు. ఇక డెల్టా ఇన్ఫెక్ష‌న్స్‌తో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో ఆస్ప‌త్రిలో చేరే అవ‌కాశం 80 శాతం త‌క్కువ‌గా ఉంద‌ని, ఒకసారి ఆస్ప‌త్రిలో చేరితో తీవ్ర వ్యాధి బారిన‌ప‌డే ముప్పు మాత్రం రెండు వేరియంట్ల‌లో ఒకే విధంగా ఉంద‌ని దక్షిణాఫ్రికాలో నిర్వ‌హించిన మ‌రో అధ్య‌య‌న‌ప‌త్రం వెల్ల‌డించింది. 

స్కాట్లాండ్ అధ్య‌య‌నం న‌వంబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 19 వ‌ర‌కూ 1,26,511 డెల్టా కేసులు, 23,840 ఒమిక్రాన్ కేసుల‌ను ప‌రిశీలించిన మీద‌ట ఈ వివ‌రాలు వెల్ల‌డించింది.  

డెల్టాతో పోలిస్తే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న యువ‌త‌లో ఆస్ప‌త్రిపాల‌య్యే ముప్పు మూడింట రెండు వంతులు త‌గ్గ‌డం ఒమిక్రాన్ అధిక జ‌నాభాపై స్వ‌ల్ప ప్ర‌భావం చూపుతుంద‌ని వెల్ల‌డిస్తోంద‌ని, ఈ అధ్య‌య‌నం ఊర‌ట ఇచ్చే అంశాన్ని అందించింద‌ని రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఇనిస్టిట్యూట్ డైరెక్ట‌ర్ జేమ్స్ నైస్మిత్ పేర్కొన్నారు.

కేంద్రం మార్గదర్శక సూత్రాలు 

ఇలా ఉండగా, ఒమైక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. కరోనా ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలని ఆదేశించారు. పండుగల వేళ వ్యాప్తిని అరికట్టేందుకు ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

1. రాత్రి కర్ఫ్యూ విధించాలని, జనం పెద్ద సంఖ్యలో గుమికూడకుండా చూడాలని సూచించారు. 

2. జిల్లాల్లో నమోదౌతున్న డెల్టా, ఒమైక్రాన్ కేసులపై దృష్టి సారించాలని సూచించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లాలని, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 

3. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచుకోవడంతో పాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆక్సిజన్ పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.  

4. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఆందోళనకు గురికాకుండా ఉండేలా సరైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు. సమాజంలో వివిధ వర్గల వారిని కలుపుకుంటూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 

5. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని కోరారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరిగిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.