ఒమిక్రాన్‌ భయంతో దేశంలో ఎక్కడికక్కడ ఆంక్షలు

ఒమిక్రాన్‌ దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్నది. ఇప్పటివరకు 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 250 కొత్త వేరియంట్‌ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు  అప్రమత్తమయ్యాయి. 

పాజిటివ్‌గా తేలిన బాధితులందరి నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపిస్తున్నట్టు ఢిల్లీ అధికారులు పేర్కొన్నారు. క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకల్లో గుమిగూడటాన్ని నిషేధించారు. డిసెంబర్‌ 31 వరకు బార్లు, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతోనే పనిచేయాలని ఆదేశించారు.

జనవరి 1 నుంచి బహిరంగ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు హర్యానా సర్కారు వెల్లడించింది. డిసెంబర్‌ 30-జనవరి 2 వరకు ఎలాంటి వేడుకలు జరుపుకోవద్దని కర్ణాటక సర్కారు ఆదేశించింది. క్రిస్మస్‌, న్యూఇయర్‌ రోజున ముంబైలో పార్టీలను నిషేధించారు. కరోనాపై గురువారం ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, హర్యానాలలో కూడా ఆంక్షలు విధించారు. 

హర్యానా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. టీకా రెండు డోసులు తీసుకోని వ్యక్తులను జనవరి 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశానికి అనుమతించబోమని తెలిపింది. 

కళ్యాణ మండపాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, బ్యాంకులు లేదా మరే ఇతర బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ అని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఒమిక్రాన్, కరోనా మూడవ వేవ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికే ఈ నిబంధన అని చెప్పారు.

ఇలా ఉండగా,  కేరళలో మరో 9 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఎర్నాకులం చేరుకున్న 6 మందికి, తిరువనంతపురం చేరుకున్న 3 మందికి ఈ కొత్త వేరియంట్ కరోనా సోకింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

 బ్రిటన్‌ నుంచి ఇద్దరు, టాంజానియా నుంచి ఒక మహిళ, ఒక బాలుడు, ఘనా నుంచి ఒక మహిళ, ఐర్లాండ్‌ నుంచి మరో మహిళ ఎర్నాకులం వచ్చినట్లు చెప్పారు. కరోనా పరీక్షలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు. 

అలాగే నైజీరియా నుంచి తిరువనంతపురానికి వచ్చిన భార్య, భర్తతోపాటు మరో మహిళకు కొత్త వేరియంట్‌ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.

అఖిలేష్ యాదవ్ భార్య డింపిల్‌కు కరోనా 

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య ఎంపి డింపిల్ యాదవ్ కు కరోనా పాజిటివ్ సోకింది. తాను పూర్తిగా వ్యాక్సినేషన్ పొందినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని డింపిల్ చెప్పారు. 
 
స్వీయ ఐసొలేషన్‌లో తానున్నానని తెలిపారు. ఇటీవల తనను కలుసుకున్న, చేరువగా ఉన్నవారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే అఖిలేష్ యాదవ్ టీకా వేయించుకున్నారో లేదో తెలీదు. కొన్ని నెలలుగా యుపి ఎన్నికలకు సంబంధించి అఖిలేష్ ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు.

మరోవంక, శాస్త్రీయంగా చ‌ర్చ జ‌రిగిన త‌ర్వాతే బూస్ట‌ర్ విష‌యంలో తాము ఓ ఫైన‌ల్ నిర్ణ‌యానికి వ‌స్తామ‌ని కరోనా టాస్క్‌ఫోర్స్ చైర్మ‌న్ వీకే పాల్  తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా ఇదే విష‌యాన్ని పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌టించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. 

బూస్ట‌ర్ డోస్ ఆవ‌శ్య‌క‌త‌, స‌మ‌యం, స్వ‌రూప స్వ‌భావాలు… ఇవ‌న్నీ కూడా శాస్త్రీయంగా చ‌ర్చ‌లు జ‌రిగిన త‌ర్వాతే ఓ తుది నిర్ణయానికి వ‌స్తామ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి పార్ల‌మెంట్ లో కూడా పేర్కొన్నారని తెలిపారు. కరోనా ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్న ల‌క్ష‌ణాలు, ఇప్ప‌టి ల‌క్ష‌ణాలు ఒకేలా ఉన్నాయా? లేదంటే ఏవైనా మార్పులు ఉన్నాయా? అన్న కోణాన్ని కూడా శాస్త్ర‌వేత్త‌లు క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేస్తూనే ఉన్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు.