నూతన సంవత్సర వేడుకలపై పలు రాష్ట్రాలలో ఆంక్షలు 

కరోనా మహమ్మారి ఓమిక్రాన్ వేరియంట్‌పై పెరుగుతున్న ఆందోళనల మధ్య, అనేక రాష్ట్రా ప్రభుత్వాలు సామూహిక సమావేశాలు, సంబరాలను నిషేధిస్తూ క్రిస్మస్-నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో 24 గంటల వ్యవధిలో 122  ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి, దేశంలో దాని సంఖ్య 358 కి చేరుకుంది.
 
మహారాష్ట్రలో అత్యధికంగా 88, ఢిల్లీలో 67, తెలంగాణలో 38, తమిళనాడులో 34, కర్నాటకలో 31, గుజరాత్‌లో 30, కేరళలో 27, రాజస్థాన్‌లో 22 కేసులు నమోదయినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. హర్యానా, ఒడిశా, జమ్మూ, కశ్మీర్, ఎపి, యుపి, చండీగఢ్, లడఖ్‌లలో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 122 కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశమని రాజేశ్ భూషణ్ తెలిపారు. వారం రోజుల క్రితం వరకు వంద కేసులలోపే ఉండడం గమనార్హం.

ఒమిక్రాన్ కేసులు ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఎటువంటి సమావేశాలు జరగకుండా చూడాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ జిల్లా మేజిస్ట్రేట్‌లను ఆదేశించింది. రెస్టారెంట్లు,  బార్‌లు సీటింగ్ కెపాసిటీలో 50 శాతం వరకు కొనసాగుతాయి. గరిష్టంగా 200 మంది వ్యక్తులతో వివాహ సంబంధిత సమావేశాలను అనుమతిస్తారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురువారం రాత్రి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటికి ఒక ఓమిక్రాన్ కేసు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ‘అందరూ అప్రమత్తంగా ఉండటానికి సరైన సమయం’ అంటూ ఆంక్షలు విధించారు.  పరిస్థితిని ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలను కూడా తీసుకొంటామని స్పష్టం చేసారు.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా పెద్దఎత్తున సమావేశాలు, బహిరంగ వేడుకలను నిషేధిస్తున్నట్లు అందరికన్నా ముందుగానే ప్రకటించింది. రాష్ట్రంలో డీజే పార్టీల వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిషేధించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఏర్పాటు చేసిన మంత్రులు, అధికారులు, నిపుణుల ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 
కొత్త సంవత్సర వేడుకల కోసం రోడ్,  బ్రిగేడ్ రోడ్. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు కూడా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకుండా నిషేధం విధించారు. రెస్టారెంట్లు, క్లబ్బులు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతీస్తారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.

ఉత్తర ప్రదేశ్ లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళన మధ్య శనివారం నుండి రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు – రాత్రి కర్ఫ్యూను రాష్త్ర ప్రభుత్వం  ప్రకటించింది. వివాహాలు, సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు 200 మంది మాత్రమే అనుమతిస్తారు. అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించాల్సి ఉంటుంది. 

 
యుపితో సహా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో రాజకీయ ర్యాలీలను నిలిపివేయాలని అలహాబాద్ కోర్టు గురువారం కేంద్రాన్ని కోరింది. ఫిబ్రవరిలో జరగాల్సిన యూపీలో అసెంబ్లీ ఎన్నికలను రెండు నెలలపాటు  వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు తెలిపింది.

ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో ఓమిక్రాన్ కేసులు నమోదైన మహారాష్ట్ర, డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు ముంబైలో సెక్షన్ 144 విధించింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రద్దీని నివారించాలని సాధారణ ప్రజలను కోరింది. మూసివేసిన ప్రదేశాలలో ఈవెంట్‌ల విషయంలో, ఏదైనా ఈవెంట్‌కు హాజరు కావడానికి 50 శాతం సామర్థ్యం వరకు మాత్రమే అనుమతిస్తారు. 

 
జనవరి 1వ తేదీనుంచి రాత్రి పూట కర్ఫూ విధించనున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదృష్టా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని శుక్రవారంనుంచి రాత్రి 11నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫూను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చెప్పారు. 
 
అంతేకాకుండా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు బహిరంగ ప్రదేశాలు, పెళిళ్ల్లు లాంటి కార్యక్రమాల్లో 200 మందికి మించి చేరడాన్ని కూడా నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. మాల్స్, దుకాణాలు, ప్రభుత్వ సంస్థల్లోకి పూర్తి వ్యాక్సిన్ తీసుకోని వారి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు కూడా సిఎం చెప్పారు. 
 
నూతన సంవత్సరం రాత్రి వేడుకలు నిషేధించామని, క్రిస్మస్ సందర్భంగా చర్చిలలో 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు వివాహాలు మినహా ఇతర వేడుకలకు అనుమతి లేదని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక సమావేశాలు, ర్యాలీలు, ఆర్కెస్ట్రాలు, హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, పార్కులు మొదలైన వాటిలో వేడుకలు కూడా నిషేధించిన్నట్లు వెల్లడించింది.