ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా వార్ రూమ్ లు … కేంద్రం ఆదేశం

దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల తీవ్ర‌త పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల‌కూ మంగ‌ళ‌వారం హెచ్చరిక‌లు జారీ చేసింది. పాత వేరియంట్ కంటే ఇది 3 రేట్లు వేగంగా విజృంభిస్తుంద‌ని, అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ఇక ఉప‌క్ర‌మించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ‌ సూచించింది.

ఈ మేర‌కు అన్ని రాష్ట్రాల‌కూ కేంద్రం లేఖ‌లు రాసింది. దీనిని నియంత్రించ‌డానికి వార్ రూమ్ ఏర్పాటు చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఒమిక్రాన్‌, డెల్టా వెరియంట్లు కూడా దేశంలో ఇప్ప‌టికీ ఉంద‌ని, జిల్లా స్థాయిల్లో కూడా దూర దృష్టితో అన్ని చ‌ర్య‌లూ తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు కేంద్రం సూచించింది.

వీటిని నియంత్రించ‌డానికి వెంట‌నే ప‌నుల‌ను కూడా ప్రారంభించాల‌ని కోరింది. ఒమిక్రాన్ త‌మ త‌మ ప్రాంతాల్లోకి ప్ర‌వేశించ‌కంటే ముందే త‌గిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించాల‌ని హెచ్చ‌రించింది. ఒమిక్రాన్‌ను నియంత్రించ‌డానికి అవ‌స‌ర‌మైతే నైట్ క‌ర్ఫ్యూల‌ను కూడా పెట్టాల‌ని లేఖ‌లో తేల్చి చెప్పింది.

దీంతో పాటు ప్ర‌జ‌లు గుమిగూడ‌కుండా చూడాల‌ని, ప్ర‌జా ర‌వాణా విష‌యంలో ఓ క‌న్నేసి ఉంచుతూ నియంత్రించాల‌ని, ఆస్ప‌త్రుల్లో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, అంబులెన్స్‌, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు స‌మ‌కూర్చుకోడం లాంటివి చేసుకోవాల‌ని కేంద్రం తెలిపింది. వీట‌న్నింటి కోసం ఎమ‌ర్జెన్సీ ఫండ్ ను కూడా ఉప‌యోగించుకోవాల‌ని కేంద్రం ఆ లేఖ‌లో పేర్కొంది. ఇక ప్ర‌తి రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యే విధంగా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌చ్చితంగా త‌గు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని కూడా కేంద్రం తెలిపింది.

తాజాగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 215 కి పెరిగింది. మహారాష్ట్రలోని తాజా 11 కేసుల్లో ముంబైలో 8, నవీముంబై, పింప్రీ చించ్వాడ్, ఉ స్మానాబాద్‌లలో ఒక్కొక్కటి వంతున కేసులు బయటపడ్డాయి.

ఇప్పటివరకు 12 రాష్ట్రాలకు ఒమిక్రాన్ విస్తరించింది. అధిక కేసులు మహారాష్ట్ర (65), ఢిల్లీ (54), తెలంగాణ (24)లో ఉన్నాయి. కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు వెలుగు చూశాయి. ఈ వేరియంట్ బా ధితుల్లో 77 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కర్ణాటకలో నూతన సంవత్సరం ఆంక్షలు 

కాగా, వేరియంట్ ఒమిక్రాన్  కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది. అయితే, భౌతిక దూరం తప్పనిసరిగా పాటిస్తూ పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది.

టీకాలు వేసుకోని వారు పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. క్లబ్‌లు, పబ్‌లలో డీజేలు, ప్రత్యేక ఈవెంట్‌ లకు అనుమతి  ఇవ్వలేదు. పబ్ ల్లో ప్రవేశం 50 శాతం సామర్థ్యానికి పరిమితం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా పెద్ద ఎత్తున పార్టీలను అనుమతించడం లేదని  సృష్టం చేసింది.

అపార్ట్‌మెంట్లలో డీజేలు ఉపయోగించకుండా నిషేధం విధించింది. అంతర్గత ప్రదేశాల్లో 50 శాతం సామర్థ్యంతో వేడుకలకు అనుమతినిచ్చింది. అధికారులు, కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి  బసవరాజ్ బొమ్మై ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటాన్ని నిషేధిస్తున్నట్లు  బసవరాజు బొమ్మై తెలిపారు. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సృష్టం చేశారు.