స్థాయి సంఘంకు యువతుల కనీస పెళ్లి వయసు బిల్లు  

దేశంలో యువతుల కనీస పెళ్లి వయసును 18ఏళ్ల నుంచి 21ఏళ్లకు పెంచే దిశగా బాల్య వివాహాల నియంత్రణ సవరణ బిల్లు – 2021ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది.  ప్రతిపక్షాల   ఆందోళనలతో  కేంద్రం  ఈ బిల్లును  స్థాయి సంఘానికి పంపింది.  

కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ బిల్లును ప్రవేశపెడుతూ . ”మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. కానీ వివాహాబంధంలోకి అడుగుపెట్టే విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలకు 75ఏళ్లు ఆలస్యంగా సమానహక్కులు కల్పిస్తున్నాం. ఈ సవరణతో ఇకపై యువతీయువకులు 21ఏళ్ల వయసులో పెళ్లిపై నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది. మహిళా సమానత్వాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లును తీసుకొచ్చాం” అని తెలిపారు.

 కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం చ‌రిత్రాత్మ‌కం అని, మ‌హిళ‌ల ప‌ట్ల త‌మ‌కు ఎటువంటి భేద‌భావం లేద‌న్నారు. మ‌హిళ‌ 18 ఏళ్ల‌కు గ‌ర్భ‌వ‌తి అయితే.. అప్పుడు గ‌ర్భ‌స్రావం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని, అలాంటి ప్ర‌మాదాల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు అని మంత్రి ఇరానీ తెలిపారు. దేశ మ‌హిళ‌ల త‌ర‌పున ఈ బిల్లును తీసుకువ‌చ్చిన ప్ర‌ధానికి థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

ఈ బిల్లును స్టాండింగ్‌ కమిటీ లేదా సెలెక్ట్‌ కమిటీకి పంపించాల్సిన అవసరం ఉందని, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరమే బిల్లును ప్రవేశపెట్టాలని డిఎంకె ఎంపి కనిమొళి పేర్కొన్నారు.

 ఈ బిల్లు .. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం యువతుల స్వేచ్ఛాయుత హక్కుకు వ్యతిరేకమని మజ్లిస్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ విమర్శించారు. 18ఏళ్ల అమ్మాయిలు ప్రధానిని ఎన్నుకోగలిగినప్పుడు, సహ జీవనం చేస్తున్నప్పుడు అదే వయసు యువతుల వివాహ హక్కును ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నించారు.  దీంతో ఈ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని కేంద్రం వెల్లడించింది. 

కొందరికి ఇబ్బంది !

కాగా, వివాహ వయో పరిమితిని 21 ఏళ్ల పెంచాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రయోగరాజ్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ ఆడకూతుళ్ల సాధికారతకు, విపక్ష నిర్మూలనకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేస్తోందని చెప్పారు. 

”ఆడకూతుళ్లు చదువుకునేందుకు తగినంత సమయం, సమానావకాశాలు కోరుకుంటున్నారు. అందుకోసం వారి వివాహ వయో పరిమితిని 21 ఏళ్లకు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం” అని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం నిర్ణయం కొందరికి బాధ కలిగిస్తోందంటూ ప్రత్యర్థి పార్టీలపై విసుర్లు విసిరారు.

అమ్మాయిలు ఉన్న‌త చ‌దువులు పూర్తి చేసేందుకు, వారికి స‌మాన హ‌క్కులు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం మ‌హిళ‌ల వివాహ వ‌య‌సును పెంచిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. కానీ ఈ నిర్ణ‌యం ప‌ట్ల కొంద‌రు ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. యూపీలోని స‌మాజ్‌వాదీ పార్టీ కేంద్ర క్యాబినెట్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టిన విష‌యం తెలిసిందే.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ”బేటీ బచావో బేటీ పడావో”తో చాలా రాష్ట్రల్లో ఆడపిల్లల సంఖ్య పెరిగిందని ప్రధాని తెలిపారు. గర్భిణీ స్త్రీల ఇమ్యునైజేషన్, ఆసుపత్రుల్లోనే ప్రసవం, ప్రెగ్నన్సీ సమయంలో న్యూట్రిషియన్‌పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద ప్రెగ్రన్సీ సమయంలో మహిళల కోసం బ్యాంకుల్లో రూ.5,000 డిపాజిట్ చేస్తున్నామని, తద్వారా వారు తగిన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోగలుగుతారని చెప్పారు.