లవ్ జిహాద్ కేసులో యువ‌కుడికి ప‌దేళ్ల జైలు

మ‌తాంత‌ర‌ వివాహాల‌కు వ్య‌తిరేకంగా భార‌త‌దేశంలోని కొన్ని రాష్ట్రాలు ల‌వ్ జిహాద్ చ‌ట్టం తీసుకువ‌చ్చాయి. ఇప్ప‌డు ఆ చ‌ట్టం కింద ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో మొట్టమొదటి తీర్పు వెలువడింది.

కాన్పూర్‌లోని జిల్లా కోర్టు ల‌వ్ జిహాద్ చ‌ట్ట ప్ర‌కారం తొలిసారి తీర్పు వెలువ‌రిస్తూ ఒక యువ‌కుడికి 10 ఏళ్ల జైలు, రూ.30వేల జరిమానా విధించింది. ఈ కేసు ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది.

ఈ కేసు ప్ర‌కారం కాన్పూర్‌లో నివ‌సించే ఇద్ద‌రు యువ‌తీ యువ‌కులు 2017లో ప్రేమించుకున్నారు. ఇంట్లో వారు త‌మ పెళ్లికి ఒప్పుకోర‌ని భావించి పారిపోయి పెళ్లి చేసుకుందామ‌నుకున్నారు. కానీ ఆ యువ‌కుడు త‌ను ఒక ముస్లిం అయిన విష‌యాన్ని ఆ యువ‌తితో చెప్ప‌కుండా దాచాడు.

పారిపోయిన త‌రువాత పెళ్లికి ముందు త‌న అస‌లు పేరు జావెద్ అని.. త‌ను ఒక ముస్లిం అని చెప్పి ఆమెను ఇస్లాం మ‌తానుసారంగా నిఖా చేసుకుంటాన‌న్నాడు. పైగా అమెను ఇస్లాం మ‌తంలోకి మార‌మ‌ని ఒత్తిడి చేశాడ‌ని ఆ యువ‌తి కోర్టుకు చెప్పింది.

అందుకు ఆమె నిరాక‌రించ‌డంతో ఆమెపై అత్యాచారం చేశాడ‌ని.. అత‌నిపై కేసు పెట్టింది. వాద‌న‌లు విన్న కాన్పూర్ జిల్లా కోర్టు.. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ల‌వ్‌జిహాద్ చ‌ట్టం 2020 ప్ర‌కారం నిందితుడికి 10 ఏళ్ల జైలు, రూ.30,000 జ‌రిమానా విధిస్తూ సంచ‌ల‌న తీర్పునిచ్చింది.

ల‌వ్ జిహాద్ చ‌ట్ట ప్ర‌కారం ఒక వ్య‌క్తి మ‌రో వ్య‌క్తిపై మ‌తం మార‌డానికి ఒత్తిడి చేయ‌కూడదు, మోస‌పూరితంగా వివాహం చేసుకొని మ‌తం మార్చ‌కూడ‌దు, మ‌తం మార్చ‌డానికే వివాహం చేసుకున్నా ఆ వివాహం చెల్ల‌దు. ఈ చట్టం కింద ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటివరకు మొత్తం 108 కేసులను నమోదు చేశారు.