బ్యాడ్మింటన్‌ లో భారత్‌కు రజత, కాంస్యాలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌కు రజత, కాంస్యాలు దక్కాయి. కాంస్య పతకం గెలిచినా లక్ష్య సేన్‌ తన ప్రదర్శన పట్ల  సంతృప్తిగా లేనని, వచ్చే ఏడాది స్వర్ణ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. 

కాగా ఈ మెగా ఈవెంట్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌ పసిడి గెలిచే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోగా,  సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్‌ (భారత్‌) కాంస్యం గెలుచుకున్నాడు. పతకం గెలిచిన లక్ష్య సేన్‌ మాట్లాడుతూ… ‘చరిత్ర సృష్టించడానికి చేరువగా వచ్చి సెమీఫైనల్లో ఓడటం బాధగా ఉంది. ఏదైతేనేం… నాకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం దక్కింది’ అని పేర్కొన్నారు. 

“అయితే నేను ఈ పతకంతో సంతృప్తి చెందడంలేదు. ఓవరాల్‌గా టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఆడుతున్నప్పటికీ… కాంస్యం సాధించి నా గురువు ప్రకాశ్‌ పదుకొనే సరసన నిలవడం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతా” అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. 

వరుస విజయాలతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌.. తుదిమెట్టుపై తడబడి రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 12వ సీడ్‌ శ్రీకాంత్‌ 15-21, 20-22తో లోహ్‌ కీన్‌ యె (సింగపూర్‌) చేతిలో పోరాడి ఓడాడు. 

దీంతో శ్రీకాంత్‌కు రజత పతకం దక్కింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత పురుష షట్లర్‌కు ఇదే తొలి రజతం కాగా.. సెమీఫైనల్లో శ్రీకాంత్‌ చేతిలో ఓడిన యువ ఆటగాడు లక్ష్యసేన్‌ ఆదివారం కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం దక్కించుకున్న మూడో భాతర షట్లర్‌గా శ్రీకాంత్‌ రికార్డుల్లోకెక్కాడు. 

గతంలో పీవీ సింధు రెండుసార్లు, సైనా నెహ్వాల్‌ ఓ సారి రన్నరప్‌ ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన సింధు క్వార్టర్స్‌లోనే పోరాటాన్ని ముగించగా.. అకానే యామగుచి (జపాన్‌) విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో యామగుచి 21-14, 21-11తో ప్రపంచ నంబర్‌వన్‌ తై జూ యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించింది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో ఒకేసారి రజత, కాంస్య పతకాలు గెలవడం భారత్ కు ఇది రెండోసారి. అంతకుముందు  2017లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు రజతం, సైనా నెహ్వాల్‌ కాంస్యం సాధించారు. ఈసారి పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌, లక్ష్య సేన్‌ పతకాలు సాధించారు.  కాగా ఈ మెగా టోర్నీలో విజేతలకు కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ప్రైజ్‌మనీ ఉండదు.