అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ మరణం

కరోనా కొత్త వేరియంట్‌ అమెరికాలో ఒమిక్రాన్‌ కారణంగా మొదటి మరణం నమోదైంది. టెక్సాస్‌లోని హారిస్‌ కౌంటిలో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే, సదరు వ్యక్తి ఇప్పటి వరకు టీకా తీసుకోలేదని, అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని ఏబీసీ న్యూస్‌ వెల్లడించింది.

 ఇంతకు అతడు రెండు సార్లు కొవిడ్‌ బారినపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కౌంటీ మెజిస్ట్రేట్‌ లీనా హిడ్గాలో కరోనా కొత్త వేరియంట్‌ కారణంగా ఒకరు మృతి చెందారని, ఇదే ఒమిక్రాన్‌ కారణంగా నమోదైన తొలి మరణమని ట్వీట్‌ చేశారు.

మరో వైపు ఒమిక్రాన్‌ వేరియంట్‌ అమెరికాలో విజృంభిస్తున్నది. ఈ నెల 18తో పూర్తయిన వీక్లీ సీక్వెన్సింగ్ డేటా ఆధారంగా అమెరికాలో కరోనా కేసుల్లో 73శాతం ఒమిక్రాన్‌ వేరియంటే కారణమని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సోమవారం పేర్కొంది. 

గత నెలాఖరులో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ రోజు రోజుకు ప్రపంచదేశాలకు విస్తరిస్తున్నది. ఇంతకు ముందు బ్రిటన్‌లో తొలి మరణం నమోదవగా.. ఇప్పటి వరకు 12 మంది మృత్యువాతపడ్డారు. 104 మంది వరకు ప్రస్తుతం ఆసుపత్రిలో చేరినట్లు బ్రిటన్‌ ఉప ప్రధాని డొమినిక్‌ రాబ్‌ పేర్కొన్నారు.

కాగా, దేశాలన్నీ క‌ల‌సిక‌ట్టుగా క‌రోనా మ‌హమ్మారిని 2022 సంవ‌త్స‌రంలో అంతం చేయాలని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ  చీఫ్ టెడ్రోస్ అధ‌న‌మ్ ఘెబ్రేస‌స్ పిలుపిచ్చారు. ఇందుకోసం అంద‌రూ క‌ఠినమైన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న‌ చెప్పారు. 

జెనీవాలో సోమ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో టెడ్రోస్ మాట్లాడుతూ ఒమిక్రాన్ లాంటి కొత్త కొ్త్త వేరియంట్ల‌ రూపంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న స‌మ‌యంలో పండ‌గ‌ల వేళ‌ ఆంక్ష‌లు త‌ప్ప‌నిస‌రిగా విధించాలని స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ మిగ‌తా వేరియంట్ల క‌న్నా చాలా వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరించారు.

అందువ‌ల్ల ప్రాణాలు పోగొట్టుకోవ‌డం క‌న్నా పండ‌గ‌లు చేసుకోక‌పోవ‌డం మంచిదని హితవు చెప్పారు. అలాగే చాలా దేశాలలో ఇప్ప‌టికే జ‌నం మొద‌టి డోస్ కోసం ఎదురుచూస్తున్నారని,  మ‌రోవైపు ధ‌నిక దేశాలు వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకుంటున్నాయని చెబుతూ ఈ ప‌రిస్థితి మారాలని స్పష్టం చేశారు.  ప్ర‌పంచ‌మంతా సమాంత‌రంగా వ్యాక్సినేష‌న్ జ‌రిగితే మంచిదని హితవు చెప్పారు.

ప్రపంచ ఆర్ధిక సదస్సు వాయిదా 

ఇలా ఉండగా, ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లూఇఎఫ్) వార్షిక సదస్సు వాయిదా పడింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల వాయిదా వేస్తున్నట్టు డబ్లూఇఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్ నగరం దావోస్ పర్వతప్రాంతం క్లోస్టర్స్‌లోని రిసార్ట్‌లో జనవరి 17-21 మధ్య సదస్సు జరగాల్సి ఉండగా వాయిదా పడింది. 

ప్రతి ఏటా జరిగే డబ్లూఇఎఫ్ సదస్సుకు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, దేశాల అధినేతలు హాజరు కానుండటం తెలిసిందే. కొవిడ్ ఉధృతి తగ్గితే 2022 వేసవి ప్రారంభంలో నిర్వహించే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. నిపుణుల సలహామేరకు భౌతిక హాజరీతో సదస్సు నిర్వహించడం తీవ్ర ఇబ్బందులతో కూడినదని భావించిన స్విస్ ప్రభుత్వం సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డబ్లూఇఎఫ్ ఆ ప్రకటనలో పేర్కొన్నది. 

వార్షిక సదస్సు వాయిదా పడినా వాణిజ్య, ప్రభుత్వ అధినేతల మధ్య డిజిటల్ సంభాషణలు జరుగుతాయని డబ్లూఇఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ క్లాజ్ స్క్వాబ్ తెలిపారు. ప్రపంచ నేతలను త్వరలోనే ఒక చోటికి చేర్చేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తామని ఆయన తెలిపారు.