ఆఫ్గనిస్తాన్‌ ప్రజలకు తక్షణమే మానవతా సాయం

ఆఫ్గనిస్తాన్‌ ప్రజలకు తక్షణమే మానవతా సాయాన్ని అందించాలని భారత్‌ –  మధ్య ఆసియా దేశాల సదస్సు పిలుపునిచ్చింది. ఇరాన్‌లోని ఛబహర్‌ పోర్టులో భారత్‌ నిర్వహిస్తున్న టెర్మినల్‌ను ఇందుకోసం వినియోగించుకోవాలని సదస్సు తీర్మానించింది. న్యూఢిల్లీలో ఆదివారం ఈ ప్రాంత విదేశాంగ మంత్రుల సదస్సు జరిగింది.

విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్‌ జయశంకర్‌ అతిథ్యంలో జరిగిన ఈ సదస్సులో కజకస్తాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజకిస్తాన్‌, తుర్కమెనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. చర్చల అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. 

”ఆఫ్గనిస్తాన్‌కు సంబంధించి ఒక విస్తృత ‘ప్రాంతీయ ఏకాభిప్రాయం’ కుదిరింది. ఆఫ్గన్‌లో నిజమైన ప్రజా ప్రాతినిధ్యంతో సమగ్ర ప్రభుత్వం ఏర్పాడాలని, ఉగ్రవాదంపై పోరాడేలా, డ్రగ్‌ సరఫరాను అడ్డుకునేలా ఆ ప్రభుత్వం ఉండాలి. ఈ దిశలో ఐక్యరాజ్యసమితిలో కీలక పాత్ర పోషించాలి” అంటూ పిలుపిచ్చారు. 

పైగా, ఆఫ్గన్‌ ప్రజలకు తక్షణమే మానవతా సాయం అందించాలని కోరారు. మహిళలు, చిన్నారుల, ఆదివాసీ ప్రజల హక్కులను పరిరక్షించాలని సంయుక్త ప్రకటనలో మంత్రులు పేర్కొన్నారు. కాగా జనవరిలో జరిగే భారత గణతంత్ర దినోత్సవ వేడుకులకు తాము ఐదుగురు మంత్రులూ హాజరౌతామని వారు  సదస్సులో వారు ప్రకటించినట్లు సమాచారం. 

అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శిఖరాగ్ర చర్చలు జరుపుతామని కూడా తెలిపారు. ఆఫ్గన్‌పై ప్రధానంగా దృష్టి సారించి ఇటీవలే జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ మధ్య ఆసియా దేశాల భద్రతాధిపతులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విదేశాంగ మంత్రుల సదస్సు జరగడం విశేషం.