కొత్త సిడిఎస్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం 

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో సిడిఎస్ బిపిన్ రావత్ మృతి చెండంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కొత్త సిడిఎస్‌ను నియమించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఇందుకోసం త్రివిధ దళాధిపతులు సిఫార్సు చేసిన పేర్లతో ఒక జాబితాను త్వరలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సమర్పించడం జరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. 

గత వారం కూనూర్ వద్ద జరిగిన హెలికాస్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్ వారసుడిని ఎంపిక చేసేందుకు త్రివిధ దళాలకు చెందిన సీనియర్ కమాండర్లతో కూడిన ఒక కమిటీని ప్రభుత్వం ఖరారు చేస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. 

త్రివిధ దళాధిపతులు సిఫార్సు చేసిన పేర్ల ఆధారంగా ఒక జాబితాను ఖరారు చేయడం జరుగుతోందని, దీన్ని త్వరలోనే రక్షణ మంత్రికి సమర్పించడం జరుగుతుందని ఈ వ్యవహారం గురించి బాగా తెలిసిన ఇద్దరు అధికారులు తెలిపారు. రక్షణ మంత్రి ఆమోదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం కోసం పేర్లను కేంద్రమంత్రివర్గానికి చెందిన అపాయింట్‌మెంట్ కమిటీకి పంపించడం జరుగుతుందని వారు తెలిపారు.

కాగా, విశేష అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త సిడిఎస్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణెను నియమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. నరవణె వచ్చే ఏప్రిల్‌లో ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేయనున్నారు. పైగా, త్రివిధ దళాధిపతులందరిలోకి నరవణెనే సీనియర్.

ఒక వేళ నరవణెను సిడిఎస్‌గా నియమిస్తే ఆయన స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్‌ను ప్రభుత్వం ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ పదవికి పోటీలో ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ సిపి మొహంతి, నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ వైకె జోషీ ప్రధానంగా ఉన్నారు. వీరిద్దరు కూడా ఒకే బ్యాచ్‌కి చెందిన వారే. ఇద్దరు కూడా వచ్చే జనవరి 31న రిటైర్ కావలసి ఉంది.