ఎన్డీఏ తొలి ప్రవేశ పరీక్షలో వెయ్యి మంది మహిళలు పాస్‌

సైనిక దళాలలో ప్రవేశం, ఆఫీసర్‌ కేడర్‌లో శిక్షణకు సంబంధించిన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్డీఏ)లో ప్రవేశానికి మహిళలకు అవకాశం కల్పించిన తొలి ప్రవేశ పరీక్షలో 1,002 మంది మహిళలు పాస్‌ అయ్యారు. 

నవంబర్‌ 14న యూపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను బుధవారం ప్రకటించారు. ఈ పరీక్షకు మొత్తంగా 5,75,856 మంది దరఖాస్తు చేయగా ఇందులో 1,77,654 దరఖాస్తులు మహిళలు నుంచి అందినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో వెల్లడించారు.

కాగా, సుమారు 8 వేల మంది మహిళలు ఎన్డీఏ పరీక్షకు హాజరుకాగా 1,002 మంది క్లియర్‌ చేశారు. ఎస్‌ఎస్‌బీ, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా వచ్చే ఏడాది ఎన్డీఏ కోర్సుకు 19 మంది మహిళలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. 

తొలుత సుమారు 20 మంది మహిళలు ఎన్డీయేలో శిక్షణ పొంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్లుగా జాయిన్‌ అవుతారని తెలుస్తున్నది. మరోవైపు ఎన్డీఏ తదుపరి కోర్సు కోసం 400 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఇందులో పది మంది మహిళలతోసహా 208 మంది ఆర్మీకి, ముగ్గురు మహిళలు సహా 42 మంది నేవీకి, ఆరుగురు మహిళలు సహా 120 మంది ఐఏఎఫ్‌కు శిక్షణ పొందుతారు. ఇప్పటి వరకు కేవలం మగవారికి మాత్రమే పరిమితమైన ఎన్డీఏలో ప్రవేశానికి మహిళలకు ఈ ఏడాది నుంచే అవకాశం ఇవ్వాలని సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో తొలిసారి ఎన్డీయే ప్రవేశ పరీక్షలో మహిళలకు అవకాశం కల్పించారు. ఇకపై ఇది కొనసాగనుండటంతో మహిళా ఆఫీసర్ల శిక్షణ కోసం పూణేలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్డీఏ)లో మౌలిక సౌకర్యాలను పెంచనున్నారు.