కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే `రేప్’ వాఖ్యపై ఎన్సీడబ్ల్యూ ఫైర్

కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్, స్పీకర్  విశ్వేశ్వర్‌‌ హెగ్డే తీరు వివాదాస్పదంగా మారింది. సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ లైంగిక దాడి అనివార్యమైనప్పుడు దాన్ని ఎంజాయ్‌ చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

ఈ వ్యాఖ్యలను ఖండించకుండా స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హెగ్డే పగలబడి నవ్వడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై పలువురు తప్పుబడుతున్నారు. ప్రజల కోసం మంచి చట్టాలను చేయాల్సిన వాళ్లే.. సున్నితమైన అంశాలపై దారుణంగా కామెంట్స్ చేయడం, వాటిపై నవ్వుకోవడం లాంటివి చేస్తున్నారంటూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్‌‌పర్సన్‌ రేఖా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రకమైన వ్యక్తులు ప్రజల అభివృద్ధి కోసం ఎలా పని చేస్తారో అర్థం కావడం లేదని ఆమె వాపోయారు. ఒకవైపు వాళ్లే చట్టాలు చేస్తూ, మరోవైపు వాళ్లే రేప్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులకు పార్టీలు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని, ఒక వేళ పార్టీలు ఇచ్చిన ప్రజలు ఓటు వేయకూడదని రేఖా శర్మ చెప్పారు.

రైతు సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ గురువారం కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను డిమాండ్‌ చేశారు. అయితే ఆ సమయంలో స్పీకర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఒక సామెత ఉంది. లైంగికదాడి అనివార్యమైనప్పుడు, పడుకొని ఎంజాయ్‌ చేయాలి. మీరు ఉన్న స్థితి కూడా సరిగ్గా అదే’ అని పేర్కొన్నారు. 

ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రమేశ్ క్షమాపణలు చెప్పారు. రేప్‌లపై తాను అసెంబ్లీలో మాట్లాడుతూ నిర్లక్ష్యపూరితంగా చేసిన కామెంట్లపై ప్రతి ఒక్కరికీ క్షమాపణ చెబుతున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. 

రేప్‌లను తీవ్రమైన నేరాలు కాదని తేలికగా చేసి చెప్పడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తాను పొరబాటుగా చేసి వ్యాఖ్యలు మాత్రమేనని చెప్పారు. ఇకపై తాను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వ్యవహరిస్తానని పేర్కొన్నారు.